23-02-2026 02:04:56 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సామాన్య ప్రయాణికులకు తక్కువ ధరలో ఆహారం అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఉడాన్ యాత్రి కేఫే ఆశించిన స్థాయిలో ప్రచారం పొందడం లేదని తెలంగాణ గిగ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ సర్వేలో తేలింది. ఈ ప్రతిష్టాత్మక పథకం గురించి మెజారిటీ ప్రయాణికులకు కనీస సమాచారం లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ ఆదివారం విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు.
మొత్తం 2,800 మంది ప్రయాణికుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదికలో నిజాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే ఫలితాల ప్రకారం.. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులలో కేవలం 26 శాతం(720 మంది) మాత్రమే ఉడాన్ యాత్రి కేఫే గురించి తెలుసని సమాధానమిచ్చారు. మిగిలిన 74 శాతం(2,080 మంది) ప్రయాణికులకు ఈ సదుపాయం గురించి అసలు తెలియనే తెలియదు. పథకంపై సరైన ప్రచారం, అవగాహన కార్యక్రమాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని నివేదిక వెల్లడించింది.
ఈ కేఫ్ గురించి 45 శాతం మంది డ్రైవర్లు లేదా తోటి ప్రయాణికుల ద్వారా తెలుసుకున్నట్లు వెల్లడైంది. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ద్వారా 20 శాతం, సోషల్ మీడియా ద్వారా 15 శాతం మందికి మాత్రమే తెలుసు. అధికారిక సైన్‌బోర్డుల ద్వారా కేవలం 10 శాతం మంది, ప్రకటనల ద్వారా కేవలం 5 శాతం మందికి మాత్రమే విషయం తెలిసిందంటే అధికారుల పర్యవేక్షణ లోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని నివేదిక ఎండగట్టింది.
ప్రస్తుతం ఈ కేఫ్ చెక్-ఇన్ హాల్ వద్ద మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ప్రయాణికులు బోర్డింగ్ గేట్ల వద్ద ఎక్కువ సమయం గడుపుతున్నందున, అక్కడ కూడా మరిన్ని ఉడాన్ యాత్రి కేఫ్‌లను ఏర్పాటు చేయాలని సర్వేలో పాల్గొన్న వారు సూచించారు. ఈ గొప్ప సదుపాయం మరింత ప్రభావవంతంగా పని చేసేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సలాఉద్దీన్ కోరారు.