కొనసాగుతున్న ద్రోణి
మూడు రోజులు వర్షాలు
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాఖాతం మీదుగా మధ్యబంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టం 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ద్రోణి కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామా రెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదివారం సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాలలో అధిక వర్షపాతం నమోదు కాగా, రంగారెడ్డి, సిద్దిపేట, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్ర పేర్కొంది.






