26 May, 2026 | 11:31 AM

పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నరు

17-06-2024 12:05 AM
  • కరీంనగర్ సీపీకి కొత్త జయపాల్‌రెడ్డి బహిరంగ లేఖ

కరీంనగర్, జూన్16 (విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతికి మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్‌రెడ్డి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. భూకబ్జాదారులపై సీపీ ఉక్కు పాదం మోపుతున్నా.. కిందిస్థాయి అధికారులు మాత్రం తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. తనపై నమోదైన కేసులపై విచారణకు సిద్ధమేనని పేర్కొనడం సంచలనం సృష్టించింది. గత కొన్ని నెలలుగా విదేశాల్లో ఉన్న జయపాల్‌రెడ్డి తనపై జరుగుతున్న ప్రచారం, నమోదవుతున్న కేసులపై లేఖలో ప్రస్తావించారు. హుస్నాబాద్‌లో పనిచేస్తున్న ఓ పోలీ స్ అధికారికి ఈవీడబ్ల్యూలో పనిచేస్తున్న మరో అధికారికి మధ్య సాన్నిహిత్యం ఉన్నదని, ఈ నేపథ్యంలోనే హుస్నాబాద్ పోలీస్ అధికారి తనపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటివరకు నమో దుచేసిన కేసుల్లో అధికార యంత్రాంగం భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈవీడబ్ల్యూలో పనిచేస్తున్న అధికారులు చెప్పిందే నిజమని సీపీ నమ్ముతున్నారని జయపాల్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తనపై నమోదైన కేసుల్లో 80శాతం తప్పుడువేనని పేర్కొన్నారు. గతంలోనూ బీఆర్‌ఎస్ సర్కార్ తనపై తప్పుడు కేసులు పెట్టించిందని చెప్పారు. తనపై కేసు నమోదు కాకముందే విదేశాలకు వెళ్లానని, కానీ, కేసు కావడంతో వెళ్లినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈవోడబ్ల్యూలో పనిచేస్తున్న అధికారులు కాకుండా ఇతర అధికారుల ద్వారా విచారణ జరిపించేందుకు నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరారు. సీపీ కేవలం భూతగాదాల విషయంపైనే దృష్టి కేంద్రీకరించి ముగ్గురు అధికారులతోనే పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. సీపీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవాలనే ఎజెండాతో ఈ అంశంపై చూపిస్తున్న శ్రద్ధ మరే ఇతర విషయాలమీద పెట్టడంలేదని లేఖలో రాశారు.