అందెశ్రీ మరణం తీరని లోటు
తెలంగాణ ప్రజా గాయకుడు
సిద్దెల హుస్సేన్
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): నికార్సయిన తత్వాల సుజ్ఞాని అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికే కాదు, సాహితీ ప్రపంచానికే తీరని లోటని తెలంగాణ ప్రజా గాయకుడు సిద్దల హుస్సేన్ అన్నారు. అక్షరం ముక్క చదువుకోకపోయినా, తన జ్ఞానంతో ఎన్నో ప్రజా సమస్యలను వేదాలను, భాషపై పట్టును సాధించి, డాక్టరేట్ సాధించిన మహోన్నత వ్యక్తిగా కీర్తించారు. తెలంగాణ సాహిత్య రంగానికి ఒక తలమానికలా నిలిచాడని, ఆయన రచనలు ఎందరికో స్ఫూర్తిని నింపి, సన్మార్గం వైపు నడిచేలా చేశాయని కొనియాడారు.
కళాకారులు భవిష్యత్తులో అందెశ్రీ స్ఫూర్తితో రచనలు రచించే దిశగా ఆలోచనలు చేయాలని హుస్సేన్ అన్నారు. మాయమైపోతున్నడమ్మా- మనిషన్నవాడు అని రాసిన అందెశ్రీ నేడు మన నుండి దూరం కావడం కడు బాధాకరమని తెలిపారు. తెలంగాణ గేయమైన జయ జయహో తెలంగాణ అందెశ్రీ కలం నుండి జాలువారిందని గుర్తు చేశారు. ఎన్నో సినీ గేయాలు, సందేశాత్మక గీతాలు, తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ పాటలను అందించిన అందెశ్రీ మృతి తెలంగాణ కళారంగాన్ని శోకసంద్రంలో ముంచిందన్నారు. ఓ సాహితీ దిగ్గజం మరణం, తెలంగాణ సమాజానికి తీరనిలోటని సిద్దెల సోమవారం నవభూమికి తెలిపారు.




