3 May, 2026 | 2:21 AM

ఎడ్యుకేషన్ హబ్‌గా అందోల్

03-05-2026 12:00 AM

అందరికీ విద్య, ఉచిత వైద్యం 

మంత్రి దామోదర్ రాజనరసింహ

సంగారెడ్డి, మే2 (విజయక్రాంతి): ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్యతో పాటు సమగ్ర వైద్య సేవలను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణా ళిక కార్యక్రమంలో భాగంగా ఆందోల్ నియోజకవర్గ స్థాయి సమావేశం శనివారం జోగిపేటలోని శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించగా మంత్రి పాల్గొని మాట్లాడారు.

ప్రజలు ఆరోగ్య సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో నే 90 శాతం వైద్య సేవలు అందించే దిశగా ఆధునిక సదుపాయాలను విస్తరిస్తున్నామని చెప్పారు. అత్యవ సర పరిస్థితుల్లో వేగవంతమైన సేవలందించేందుకు ట్రామా, ఎమర్జెన్సీ సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.

మహిళల సాధికారతకు ప్ర భుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణా ళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రూ.200 కోట్ల వ్యయంతో సింగూర్ లైన్ పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. సింగూర్ ప్రాంతా న్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని, పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ జిల్లా విద్య, వైద్య రంగాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.  జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్ శాఖ ద్వారా రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్, మహిళల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.  అడిషనల్ కలెక్టర్ పాండు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.