17 August, 2026 | 9:06 AM

అంగన్‌వాడీ @ ప్రీస్కూల్

17-06-2024 12:25 AM
  • జిల్లాలో 1,076 కేంద్రాలు ఎంపిక

పూర్వ ప్రాథమిక విద్య బలోపేతమే లక్ష్యం

సూపర్‌వైజర్లకు శిక్షణ పూర్తి

మెదక్, జూన్ 13(విజయక్రాంతి): పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. దీనిలో భాగంగానే అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలలు (ప్రీ స్కూల్స్)గా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమ లు చేయనుంది. ఈ మేరకు సూపర్‌వైజర్లకు విద్యా బోధనపై శిక్షణ ఇచ్చారు. పిల్లల్లో క్రమశిక్షణతో పాటు తారతమ్యం లేకుండా ఉండేలా యూనిఫాం అమలు చేయనుంది. కాగా స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రీస్కూల్స్ నిర్వహణ చేపట్టనున్నారు. 

మొత్తం 1076 కేంద్రాలు

మెదక్ జిల్లాలో 1076 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో గర్భిణులు 5,481 మంది, బాలింతలు...5,179, ఏడు నెలల నుంచి సంవత్సరం పిల్లలు 5,867, మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు పిల్లలు 18,804 మంది ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.  

అన్ని కేంద్రాల ఎంపిక

ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా ఎంపిక చేశారు. కాగా జిల్లాలో ఉన్న 1076 అంగన్‌వాడీ  కేం ద్రాలను ఎంపిక చేసి నిబంధనల ప్రకారం మార్పులు చేస్తున్నారు. పెయింటింగ్‌తో పాటు ఇతర పనులు చేపడుతున్నారు. మోడల్ కేంద్రాల మాదిరిగా తీర్చిదిద్దుతున్నారు. ఈ కేంద్రాలకు సరఫరా చేసిన పుస్తకాల సిలబస్‌లో కూడా కొంత మార్పు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రీస్కూల్స్‌గా మార్పు చేసిన కేంద్రాలకు ఇతర అంగన్‌వాడీ కేంద్రాలకు కొంత వ్యత్యాసం ఉంటుంది. ప్రీస్కూళ్లలో చదివే పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా యూనిఫాం అందిస్తుంది. డీఆర్‌డీఏకు యూనిఫాం కుట్టు పను లు అప్పగించారు. కాగా ఎంపికైన కేంద్రాల్లో 18,803 మంది బాలబాలికలు హాజరవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

విద్యాబోధనలో మార్పులు

ఇప్పటి వరకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పోషకాహారం అందించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆట, పాటలతో విద్యాబోధన చేపడుతున్నారు. అయితే ప్రీ స్కూల్‌లో మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ స్థాయిలుగా ప్రేరణాత్మక, కృత్యధార బోధన ఉంటుందని అంగన్‌వాడీ టీచర్లు తెలిపారు. జూన్ నుంచి ఆగస్టు వరకు ఆట పాటలు, ప్రకృతి, సైన్స్, యోగా, పూర్వ గణితం, రంగులు ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతీరోజు ఉదయం 9 నంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ కార్యక్రమాలతో పాటు కృత్యాలతో పిల్లలకు విద్యాబోధన చేస్తారు.

నాలుగో శనివారం పూర్వ ప్రాథమిక విద్యా దినోత్సవం జరిపి కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. పిల్లల్లో వచ్చిన మార్పులు, అభివృద్ధిని తల్లిదండ్రులకు తెలియజేస్తారు. జిల్లాలో 44 సెక్టార్లు ఉండగా 32 మంది సూపర్ వైజర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ప్రీ స్కూల్ నిర్వహణ, విద్యాబోధనపై ఈ ఏడాది మార్చిలోనే సూపర్‌వైజర్లకు, ఇద్దరు సీడీపీవోలకు శిక్షణ ఇచ్చారు. అంగన్‌వాడీ టీచర్లూ శిక్షణ పొందనున్నారు.

ప్రాథమిక విద్యను బలోపేతం చేయడమే

పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ప్రీస్కూల్స్‌ను ఏర్పాటు చేసింది. సంబంధిత మెటీరియల్, కిట్స్, పుస్తకాలు, యూనిఫాం అన్ని తర్వలోనే కేంద్రాలకు సరఫరా అవుతాయి. ప్రస్తుతానికి పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. 

 డి.బ్రహ్మాజీ, డీడబ్ల్యూవో మెదక్