17 August, 2026 | 8:00 AM

దొంగల ముఠా అరెస్ట్

17-06-2024 12:35 AM
  • తుర్కయంజాల్ చోరీ కేసును చేధించిన పోలీసులు

14 మంది నిందితులకు రిమాండ్

3 కార్లు, కత్తులు, నకిలీ నోట్లు స్వాధీనం

ఇబ్రహీంపట్నం, జూన్ 16 (విజయక్రాంతి) : తుర్కయంజాల్‌లోని శ్రీరామ్ నగర్‌కాలనీలో ఓ ఇంట్లో చోరీకి యత్నించిన కేసులో ఆదిబట్ల పోలీసులు చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేశారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. శ్రీరామ్‌నగర్‌లోని చాక్లెట్ కంపెనీ యజమాని తురు మల తురై ఇంటికి ఈ నెల 10 అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు వచ్చి సీసీ కెమెరాలను ద్వంసం చేసి, వాచ్‌మెన్‌ను తాళ్ళతో కట్టేసి దొంగతనానికి యత్నించారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి నుండి పారిపోయారు.

దీంతో దర్యాప్తు చేపట్టిన ఆదిబట్ల పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 14 మందిని అరెస్ట్ చేశారు. న్యాయస్థానం తీర్పు మేరకు వారికి రిమాండ్ విధించారు. నిందితుల నుంచి 3 కార్లు, ఒక స్కూటీ, 16 సెల్‌ఫోన్లు, 2 ఐరన్ కట్టర్లు, 2 అడ్జెస్టబుల్ స్పానర్లు,  2 ఫైర్ స్ప్రేలు, ఒక ఇనుప రాడ్, 6 నకిలీ నోట్లు తయారు చేసే నల్ల కాగితాల బండిల్స్, నకిలీ నోట్లు తయారీ పౌడర్, 20 లీటర్ల లిక్విడ్, 80 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును చేధించిన సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఎస్‌ఐ డి.కృష్ణయ్య, హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు, కానిస్టేబుల్స్ కృష్ణ, రవీందర్, ఉపేందర్, శివచంద్ర, సంతోష్‌లను డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ కేపీవీ రాజు అభినందించారు.