23 June, 2026 | 1:33 AM

అంగన్వాడీ టీచర్లను బీఎల్‌ఓ విధుల నుంచి మినహాయించాలి

23-06-2026 12:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 22, (విజయక్రాంతి): జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు అదనంగా కేటాయించిన బీఎల్‌ఓ (బూత్ లెవల్ ఆఫీసర్) విధులను తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ (AITUC) నాయకులు డిమాండ్ చేశారు.  ఈ మేరకు సోమవారం  జిల్లా కలెక్టరేట్లో అధికారులను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం  ప్రతినిధులు మాట్లాడుతూ, జిల్లాలోని దాదాపు 50 శాతానికి పైగా అంగన్వాడీ కేంద్రాలలో గత కొన్నేళ్లుగా హెల్పర్లు (సహాయకులు) లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనివల్ల టీచర్లే అటు బోధనతో పాటు ఇటు కేంద్రాల నిర్వహణ పనులను కూడా ఒంటరిగా చూసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి అదనంగా ఓటర్ల జాబితా సవరణ వంటి బీఎల్‌ఓ విధులను అప్పగించడం వల్ల అంగన్వాడీ కేంద్రాలు మూతపడే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

పౌష్టికాహారం, ముందస్తు విద్యకు ఆటంకం టీచర్లు ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడం వల్ల కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు,చిన్న పిల్లలకు అందాల్సిన పౌష్టికాహార పంపిణీతో పాటు, ప్రీ-స్కూల్ బోధన పూర్తిగా కుంటుపడుతోందని వారు తెలిపారు. 

బీఎల్‌ఓ విధులకు సంబంధించి ఎలాంటి అలవెన్సులు (TA, ౄA) ఇవ్వకపోగా, ఆన్లైన్ పనుల కొరకు కనీసం ట్యాబ్లు ,మొబైల్ ఫోన్లు కూడా సమకూర్చలేదని మండిపడ్డారు. కావున, ఉన్నతాధికారులు,ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి అంగన్వాడీ టీచర్లను బీఎల్‌ఓ విధుల నుండి మినహాయించాలని, లేనిపక్షంలో మాతా శిశు సంరక్షణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు.