23 June, 2026 | 1:33 AM

కలెక్టరేట్ మెట్లపై ఉప్పల్ ఎమ్మెల్యే

23-06-2026 12:00 AM

మేడ్చల్, జూన్ 22 (విజయక్రాంతి): గెలువగానే హంగు, ఆర్భాటాలతో దర్పం ప్రద ర్శించే ఎమ్మెల్యేలు ఉన్న ఈ రోజుల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండటమే గాక అతి సామాన్య వ్యక్తిలా ఉంటారు. సోమవారం కలెక్టరేట్ కు వచ్చిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మెట్ల మీద కూర్చుని అందరిని ఆకర్షించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వాలని బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు.

బండారు లక్ష్మా రెడ్డి మిగతా ఎమ్మెల్యేల కంటే ముందుగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. వారు వచ్చేవరకు మెట్ల మీద కూర్చుని నిరీక్షించారు. లక్ష్మారెడ్డి డ్రెస్సింగ్ కూడా సాదాసీదాగా ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యే ఖద్దరు దుస్తులు ధరిస్తే, ఈయన మామూలు డ్రెస్సులు, టీ షర్టులు ధరిస్తారు. ఎమ్మెల్యేలు పర్యటనకు వెళితే వెనుక ఐదారు వాహనాలతో కానువాయిగా వెళ్తారు. ఈయన మాత్రం సింగిల్ గానే వెళ్తారు. ఈయనకు గన్మెన్ కూడా లేడు. పదవి వచ్చిన పద్ధతి మార్చుకొని నాయకుడిగా, ప్రజల్లో ఒకటిగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారని స్థానికులు ప్రశంసి స్తున్నారు. ‘అధికారం హోదా కాదు, బాధ్యత’ అని చేతల్లో చూపిస్తున్నారని ఆయనను కొనియాడుతున్నారు.