ఘనంగా అంజిరెడ్డి జన్మదిన వేడుకలు
కరీంనగర్‌లోని కేపీఎస్ హైస్కూల్‌లో నిర్వహణ
విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసిన కోట విద్యా సంస్థల చైర్మన్
కరీంనగర్, ఆగస్టు 4 (విజయక్రాంతి): కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి. అంజిరెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం కరీంనగర్ నగరంలోని రేకుర్తిలో గల కేపీఎస్ హైస్కూల్ ఆవరణలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కోట జూనియర్ కళాశాలలు, కేపీఎస్ హైస్కూల్ ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, కుటుంబ సభ్యులు పల్లవి అంజిరెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు సంయుక్తంగా పాల్గొని జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరిపారు.
ఈ సందర్భంగా కోట విద్య సంస్థల చైర్మన్ డాక్టర్ డి.అంజిరెడ్డి చే కేక్ కట్ చేయించారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆయన దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాల కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక విన్యాసాలతో విద్యార్థులు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో కోట జూనియర్ కళాశాలల జోనల్ ఇన్‌చార్జి సుదర్శన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కళ్లెం అజయ్ రెడ్డి, కోట ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ జి మునీందర్ రెడ్డి, కోట అడ్వాన్సుడ్ ప్రిన్సిపాల్ డి శ్రీనివాస్, గణేష్ నగర్ ప్రిన్సిపాల్ బి నరసింహారెడ్డి, కేపీఎస్ హైస్కూల్ అకాడమిక్ డైరెక్టర్ రమ్యరెడ్డి ప్రిన్సిపాల్ అనిల్ కుమార్, అకాడమిక్ డీన్ పి సిదిరాజ్, ప్రిన్సిపాళ్లు, కేపీఎస్ హైస్కూల్ లెక్చరర్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






