5 August, 2026 | 1:05 AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

05-08-2026 12:00 AM
  1. ఈ నెల చివరికల్లా అదనపు ఛార్జ్ షీట్?
  2. కొత్త పేర్లు, వివరాలు చేర్చడంపై సందిగ్ధం

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యా ప్తు కీలక దశకు చేరుకున్నది. ఈ కేసులో దర్యాప్తు నిర్వహిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ నెల చివరినాటికి అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలు, వందల మంది వాంగ్మూలాల ఆధారం గా ఛార్జ్ షీట్‌ను మరింత పటిష్ఠంగా రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది.

సిట్ ఇప్పటివరకు ఈ కేసులో పలువురు మాజీ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర కీలక వ్యక్తులను విచారించింది. మొత్తం 600 మందికిపైగా వ్యక్తుల స్టేట్‌మెంట్లు నమోదు చేసినట్టు సమాచారం. వీటి ఆధారంగా కేసుకు సంబంధించిన సంఘటనల క్రమం, బాధ్యతలపై స్పష్టత వచ్చిందని, అదే ఆధారంగా అదనపు ఛార్జ్‌షీట్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. 

అయితే అదనపు ఛార్జ్ షీట్‌లో రాజకీయ నేతల పేర్లను చేర్చాలా? లేదా? అనే అంశంపై సిట్ అధికారులు న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. చట్టపరంగా బలమైన ఆధారాలు ఉన్నప్పుడే పేర్లు చేర్చాలనే దిశగా అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

ఈ కేసులో భారత టెలిగ్రాఫ్ చట్టం (టెలిఫోన్ యాక్ట్)లోని నిబంధనలను కూడా చేర్చి ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాన్ని సిట్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ చట్టం కింద ఇలాంటి కేసులో ఛార్జ్ షీట్ దాఖలవడం అరుదైన పరిణామంగా భావిస్తున్నారు. దర్యాప్తులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును కీలక సూత్రధారిగా సిట్ గుర్తించింది.

అయితే ఆయన విదేశాల్లో ఉండటం, భారత్‌కు రావడం ఆలస్యమవడంతో విచారణ కూడా కొంత మేర జాప్యం జరిగినట్టు తెలుస్తున్నది. ఆయన విచారణ అనంతరం మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. 

దర్యాప్తులో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు సహా పలువురి ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేసినట్టు ఆధారాలు లభించినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో విస్తృత స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సిట్ గుర్తించినట్టు తెలుస్తున్నది.

ఈ నేపథ్యంలో కోర్టులో సాంకేతిక, న్యాయపరమైన పరీక్షలను తట్టుకునేలా ప్రతి ఆధారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అదనపు ఛార్జ్ షీట్‌ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ ఛార్జ్ షీట్‌లో కొత్త వివరాలు, కొత్త పేర్లు, మరిన్ని సాంకేతిక ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఈ కేసు చర్చనీయాంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.