ఎత్తిపోతల పంచాయితీ!
- అధికార, విపక్షాల మధ్య కాళేశ్వరం లొల్లి
- ఎల్లంపల్లి వద్ద కాంగ్రెస్ నాయకుల జలాభిషేకం
- గాయత్రీ పంప్ హౌస్ వద్ద బీఆర్‌ఎస్ పూజలు
- రోజురోజుకు ముదురుతున్న వివాదం
కరీంనగర్, ఆగస్ట్4(విజయక్రాంతి):కరీంనగర్ జిల్లాలో ఎత్తిపోతల పంచాయతీ నడుస్తుంది. నంది మేడారం, లక్ష్మిపూర్ పంపు హౌస్ల సందర్శనల నేపథ్యంలో బీఆర్‌ఎస్ , కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర రాజకీయ పోటాపోటీ, ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఎత్తిపోతల పథకాల నిర్వహణ, పంప్హౌస్ల పరిశీలన అంశాలపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు పరస్పర పర్యటనలు చేపట్టారు. బీఆర్‌ఎస్ నేతల పర్యటన తర్వాత కాంగ్రెస్ నాయకులు పంప్హౌస్లను శుభ్రం చేయడం లాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో వివాదం ముదిరింది.
ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యంపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కె సి ఆర్ కాళేశ్వరం ప్రాజెక్టువల్లే నీళ్లు మెడ్ మానేరుకు ఎత్తిపోస్తున్నారంటూ బి ఆర్ ఎస్ నాయకులు గాయత్రి పంప్ హౌస్ ను సందర్శించి పూలు చల్లి కె సి ఆర్ కు జై కొట్టారు. కాళేశ్వరం నీళ్లు కాదు శ్రీపాద ఎల్లంపల్లి నుండి విదులైన నీళ్లంటూ కాంగ్రెస్ వారు తమ నేతలకు పాలాభిషేకం చేశారు. ఈ ఎత్తిపోతల పంచాయతీ కాంగ్రెస్ పార్టీ కి చెందిన డి సి సి అధ్యక్షడు మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ నాయకుడు సుంకే రవిశంకర్ ల మధ్య మాటల యుద్ధంలో ఆయా పార్టీల ముక్ష నేతలు ప్రాజెక్టుల సందర్శనకు దారితీసింది.
అజ్ఞానానికి నిదర్శనం
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానానికి నిదర్శనం. . తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్టు ’కూళేశ్వరం’ కాదుం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక . అసలు గ్రావిటీ అంటే ఏమిటో కూడా తెలియని మంత్రులు.. ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది.
మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే..
ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో బిఆర్‌ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తున్నారు. గాయత్రి పంప్ హౌస్,నంది పంప్ హౌస్ ద్వారా నంది మేడారం చెరువును నింపుతున్న నీరు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే సరఫరా అవుతోంది.
వాస్తవాలను విస్మరించి, ఎల్లంపల్లి నీటిని కాలేశ్వరం నీరుగా చూపిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. . కాలేశ్వరం పేరుతో అసత్య ప్రచారాలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమే. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని కాలేశ్వరం నీరుగా ప్రచారం చేస్తున్న బిఆర్‌ఎస్ నాయకులు తమ వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలిన, వారి విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేస్తున్నా. ప్రజలకు వాస్తవాలు తెలుసునని, అభివృద్ధి కార్యక్రమాలే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.
మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే చొప్పదండి






