బకాయిలు ఇంకెప్పుడిస్తరు?
- పదవీ విరమణ పొంది ఏళ్లు గడిచినా నిరీక్షణేనా?
- ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆగ్రహం
- వేలాది మంది బస్‌భవన్ ముట్టడి
- రిటైర్మెంట్ బెన్‌ఫిట్స్ తక్షణమే చెల్లించాలని డిమాండ్
- పెన్షన్, పీఎఫ్,గ్రాట్యుటీ సమస్యలు పరిష్కరించాలి
- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంఘీభావం
- ప్రభుత్వానికి వారం రోజులు డెడ్‌లైన్
ముషీరాబాద్,ఆగస్టు 4 (విజయక్రాంతి): బకాయిలు చెల్లించాలని, పెన్షన్, పీఎఫ్, గ్రాట్యుటీ వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని బస్ భవన్‌ను ముట్టడించారు. ‘చలో బస్ భవన్‘ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా రిటైర్డ్ ఉద్యోగులు తరలివచ్చి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ 2017, 2021 సంవత్సరాలకు సంబంధించిన రిటైర్మెంట్ బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోవడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు రెండు నెలలకు సరిపడా మందులను ఈఎస్‌ఐ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలని, మరణించిన ఉద్యోగుల భార్య లేదా భర్తలకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. వితంతు ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ కేసులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పోలీసులతో వాగ్వాదం, ఉద్రిక్తత
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్‌పీ) చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. మల్లన్న బస్ భవన్ వద్దకు రావడంతో పోలీసులకు, ఆయనకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చివరకు మల్లన్నతో పాటు ఐదుగురు రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులకు అధికారులను కలిసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులను రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మల్లన్న నిలదీశారు.
2013లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇప్పటికీ పీఎఫ్ చెల్లించలేదని, 2017 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు 2021 నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు జీవితాంతం సంస్థ కోసం కష్టపడితే, రిటైర్మెంట్ తర్వాత వారికి రావాల్సిన కష్టార్జిత సొమ్మును నిలిపివేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన్ వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్ ,రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ సాజిద్,గ్రేటర్ హైదరాబాద్ జోన్ బీడబ్ల్యూయూ గౌరవ అధ్యక్షుడు టీవీఆర్,తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, సహాయ కార్యదర్శి గిరిగాని భిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ వల్లే ఈ పరిస్థితి: తీన్మార్ మల్లన్న
ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని తీన్మార్ మల్లన్న విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఢిల్లీ మాదిరి ఉద్యమం ఈ తెలంగాణలో పుట్టిస్తానని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి లాంటి సన్నాసి, దద్దమ్మ ముఖ్యమంత్రి ఉండటం వల్లే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఈ పరిస్థితి దాపురించిందన్నారు.
ఇలాంటి వ్యక్తి తెలంగాణకు సీఎంగా ఉండడం దురదృష్టకరమన్నారు. రాబోయే రోజుల్లో ఇదే ఆర్టీసీ కార్మికులు రేవంత్ సర్కార్‌ను బొందపెడుతారని హెచ్చరించారు. ‘17 వేల మంది రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు అండగా తీన్మార్ మల్లన్న ఉన్నాడని,వారి హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే బస్ భవన్ ను అర్రాస్ పాట పెట్టి అమ్మునా సరే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించుకుంటామని పేర్కొన్నారు.
వారం రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ విడుదల చేయాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. లేకుంటే డిల్లీ తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు.
ఆర్టీసీ ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తూ ‘దమ్ముంటే ఎన్నికలకు రండి. నేను ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల తరఫున వస్తా. రేవంత్ తన బొమ్మతో,కాంగ్రెస్ పార్టీ జెండాతో రావాలి. కార్మికులే తీర్పు చెబుతారు‘ అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కార్మికులను మోసం చేస్తే ప్రభుత్వం, అధికారులు ఇద్దరూ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని, ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదనిఅని మల్లన్న స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన శాసనమండలిలో, ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తానని పేర్కొన్నారు.






