రైతు భరోసాపై స్పష్టమైన ప్రకటన చేయాలి
మాజీ పీసీఎస్ చైర్మన్ పెంటు
వాంకిడి,(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా సంబంధిత మంత్రులు యాసాంగి రైతు భరోసా ఇస్తారా లేదా అన్న విషయంపై వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని వాంకిడి మండల మాజీ పీసీఎస్ చైర్మన్ జాబోరే పెంటు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ... జనవరి 1వ తేదీన కొత్త సంవత్సర కానుకగా రైతు భరోసా ఇస్తామని, అనంతరం సంక్రాంతి పండుగకు ఇస్తామని, తరువాత మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉందని, ఫిబ్రవరి 17వ తేదీన తప్పనిసరిగా రైతు భరోసా వేస్తామంటూ కాలయాపన చేసి, వరి రైతులకు రూ.500 వేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన ఇప్పటి వరకు ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేయకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం... వానకాలం, యాసాంగి సీజన్లతో సంబంధం లేకుండా పంటలు సాగు చేసే భూములకు సంవత్సరానికి రూ.12,000 రైతు భరోసాను సమయానికి రైతుల ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆయన వెంట రైతులు రాజేశ్వర్, గణపతి, సుభాష్, యాదవ్ తదితరులున్నారు.




