10 July, 2026 | 5:33 PM

మరో ఇస్కాన్ సభ్యుడు అరెస్ట్

01-12-2024 04:26 AM

శ్యామ్ దాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

బంగ్లాలోని మూడు దేవాలయాలపై అల్లరిమూక దాడులు

మైనార్టీలపై దాడిని ఖండించిన ఆరెస్సెస్

భారత్‌పై ఎదురుదాడికి దిగిన బంగ్లా ప్రభుత్వం

ఢాకా, నవంబర్ 30: బంగ్లా పోలీసులు మరొక ఇస్కాన్ ప్రచారకర్తను అదుపులోకి తీసుకున్నారు. జైలులో ఉన్న చిన్మయ్ కృష్ణదాస్‌ను కలిసేందుకు వెళ్లిన ఇస్కాన్ ప్రచారకర్త శ్యామ్  దాస్,  ప్రభును పోలీసులు ఛటోగ్రామ్‌లో శుక్రవారం అరెస్ట్ చేశారు. ఎటువంటి అరెస్ట్ వారెంట్ లేకుండానే శ్యామ్ దాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వారెంట్ లేకుండానే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, విడుదల చేయడం వంటి అధికారాలను అక్కడి ప్రభుత్వం పోలీసులకు కల్పించింది.

ఈ అధికారాలను ఉపయోగించుకునే శ్యామ్ దాస్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. శ్యామ్ దాస్ అరెస్ట్ విషయాన్ని కోల్‌కత్తా ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారామణ్ దాస్ కూడా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ధ్రువీకరించారు. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో చిన్మయ్ కృష్ణదాస్‌ను అరెస్ట్ చేయడంతో బంగ్లా వ్యాప్తంగా హిందువులు ఆందోళనలు చేస్తున్నారు. 

మూడు దేవాలయాలు ధ్వంసం

పోర్ట్ సిటీలోని హరీశ్ చంద్ర మున్సిఫ్ లేన్‌లో ఉన్న మూడు గుళ్లపై అల్లరిమూక శుక్రవారం మధ్యాహ్నం దాడి చేసి ధ్వంసం చేసింది. కొందరు వ్యక్తులు నినాదాలు చేస్తూ గుళ్లపైకి ఇటుకలను విసిరినట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఘటనలో దేవాలయాలు పాక్షికంగా దెబ్బతిన్నట్టు పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇస్కాన్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాలోని హిందువుల భద్రత కోసం ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా ప్రార్థనలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. 

దాడులను ఖండించిన ఆరెస్సెస్

బంగ్లాలోని హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) ఖండించింది. మైనార్టీ ప్రజలపై దాడులు జరుగుతుంటే మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. బంగ్లాలో మైనార్టీలు ఎదుర్కొంటున్న పరిస్థితులను నిరోధించే దిశగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. అలాగే దేశద్రోహం కేసులో అరెస్ట్ చేసిన చిన్మయ్ కృష్ణదాస్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. 

బంగ్లా పేషెంట్లకు చికిత్స చేయం

బంగ్లా నుంచి వచ్చే పేషెంట్లకు చికిత్స చేయబోమని కోల్‌కత్తాలోని జేఎన్ రే ఆసుపత్రి శుక్రవారం ప్రకటించింది. కొందరు బంగ్లాదేశీయులు భారత జాతీయ జెండాను అవమానించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆసుపత్రి యాజమాన్యం వివరించింది. 

భారత్ ద్వంద్వ వైఖరి: బంగ్లాదేశ్

మైనారిటీల విషయంలో భారత్ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని బంగ్లాదేశ్ ఆరోపించింది. భారత్‌లో ముస్లిం కమ్యూనిటీ ప్రజల పై అనేక దాడులు జరుగుతున్నా వాటిని భా రత ప్రభుత్వం పట్టించుకోవడం లేదంది. భారత్‌లో జరుగుతున్న దాడులకు పశ్చాత్తాపం తెలపకుండా బంగ్లా పరిణామాలపై ఆందోళన తెలపడం అభ్యంతరకరమని పేర్కొంది.