5న మహా సీఎం ప్రమాణం
- ఆజాద్ మైదాన్‌లో జరిగే కార్యక్రమానికి అతిథిగా మోదీ
- మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ ప్రకటన
- బీజేపీ నుంచే సీఎం అభ్యర్థి.. డిప్యూటీలుగా ఎన్సీపీ, శివసేన నేతలు
- ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ వెల్లడి
- కూటమిలో ఆసక్తిగా మారిన షిండే అంశం
ముంబై, నవంబర్ 30: మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు విడుదలై వారం గడిచిం ది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూట మి 234 సీట్లతో ప్రభంజనం సృష్టించింది. ముఖ్యమంత్రి పదవిపై సందిగ్ధం కొనసాగుతున్న వేళ ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ స్పష్ట తనిచ్చింది. డిసెంబర్ 5న సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ రాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ శనివారం వెల్లడించారు.
దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదానంలో గురువారం ప్రమాణస్వీకారం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారని చెప్పారు. సీఎంగా బీజేపీ నేతనే ఉంటారని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ శనివారం తెలిపారు. డిప్యూటీ సీఎం పదవులు ఎన్సీపీ, శివసేనలకు దక్కుతాయని తెలిపారు. ఈ విషయం పై ఇప్పటికే నిర్ణయం జరిగిందని చెప్పారు. కాగా, డిసెంబర్ 2న బీజేపీ శాసనసభా పక్ష నేత ఎంపిక జరగనున్నట్లు సమాచారం.
షిండేకు అనారోగ్యం!
ఢిల్లీలో గురువారం రాత్రి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ తర్వాత ఆ పార్టీ ప్రతిపాదనలు షిండేకు నచ్చలేదనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఢిల్లీ నుంచి రాగానే షిండే తన సొంతూరు సతారాకు వెళ్లిపోయారు. దీంతో ముంబైలో కూటమి నేతల మధ్య శుక్రవారం జరగాల్సిన కీలక సమావేశం అకస్మాత్తుగా రద్దుంది. ఈ వ్యవహారమంతా పలు అనుమానాలకు దారితీసింది.
షిండే అంసతృప్తితో ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ ప్రచారాన్ని శివసేన నేతలు తోసిపుచ్చారు. అమిత్ షా నిర్ణయంపై షిండే కలత చెందలేదని, ఢిల్లీ నుంచి రాగానే అస్వస్థతకు గురయ్యారని తెలిపింది. అందుకే సతారాకు వెళ్లారని, రద్దున సమావేశం శనివారం లేదా ఆదివారం జరిగే అవకాశముందని శివసేన నేత, ఐటీ మంత్రి ఉదయ్ సామంత్ చెప్పారు. మరోవైపు షిండే ఆదివారం కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన కూటమిలో కొనసాగుతారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
కీలకంగా మరాఠా అంశం
రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ కీలకమైన ముఖ్యమంత్రి, హోంశాఖ పదవులు తమకే కావాలని ఆశిస్తోంది. కానీ షిండే నేతృత్వంలోని కూటమికే ప్రజలు మద్దతు తెలిపారని, అందువల్ల షిండేనే కొనసాగించాలని శివసేన డిమాండ్ చేస్తోంది. బీజేపీ 132 సీట్లు సాధించినప్పటికీ సీఎం ఎంపికలో బీజేపీ దూకుడు ప్రదర్శించలేకపోతోంది. ఇందుకు ప్రధాన కారణం మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది.
ఈ వర్గంలో షిండేతో పాటు శివసేన నేతలు కీలకంగా ఉన్నారు. ఒకవేళ ఫడ్నవీస్‌కు సీఎం పదవి కట్టబెడితే మరాఠాల మద్దతు పోతుందేమోనని బీజేపీ భయపడుతోంది. అందుకే కొత్త పేర్లు సైతం తెరమీదికి వస్తున్నాయి.
తెరపైకి కొత్త పేర్లు!
దేవేంద్ర ఫడ్నవీస్‌వైపే బీజేపీ మొగ్గు సామాజిక సమీకరణాలపైనా బీజేపీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. షిండేను సీఎంగా కొనసాగించేందుకు విముఖత చూపిస్తుండటంతో పాటు పలు వర్గాలను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫడ్నవీస్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించి సీఎం స్థానంలో మరొకరిని కూర్చొబెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
మురళీధర్ మహోల్, వినోద్ తావ్డే, రాధాకృష్ణ విఖే వంటి పేర్లను బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో పుణె ఎంపీ, కేంద్రమంత్రి మురళీధర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ అంశంపై స్పందించిన మురళీధర్.. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. సీఎం రేసులో తానున్నానని వస్తున్న వార్తలు పూర్తి కల్పితమని, ముఖ్యమంత్రి ఎవరనేది బీజేపీ పార్లమెంటరీ బోర్డు తేలుస్తుందని స్పష్టం చేశారు.






