15 April, 2026 | 3:16 AM

మరో గ్రంథాలయ ఉద్యమం అవసరం

01-11-2025 12:00 AM

మన విద్యార్థులు తరగతి గది పుస్తకాలను బట్టి పట్టి పరీక్షల్లో అత్యధిక మార్కుల రావాలని.. అలాగే ఐఐటి, ఎప్‌సెట్, సివి ల్స్ ర్యాంకుల కోసం చదువుతూనే ఉన్నారు. తల్లిదండ్రుల ఒత్తిడితో కొం దరు పిల్లలు తమను తాము ఒత్తిడిలోకి నెట్టేసుకుంటున్నారు. ఒత్తిళ్ల నేపథ్యంలో బడుల్లో, కాలేజీల్లో వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

అయితే చదువుతో పాటు ఒత్తిడిని ఎలా జయించాలనేది స్కూళ్లలో, కళాశాలల్లో అధ్యాపకులు నేర్పడం లేదని నిందలు వేయ డం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక బడిలో లేదా కాలేజీలో గ్రంథాలయం ఎందుకు లేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే ఇప్పటి వ్యవస్థలో తరగతి గది పుస్తకాలు తప్ప పిల్లలకు గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివేలా ఎందుకు ప్రోత్సహించడం లేదన్నది అర్థం కాని విషయం.

మానసిక ఒత్తిడిని దరి చేరనీయ కుండా ప్రతి బడిలో లేదా కా లేజీలో ఒక గంటపాటు లై బ్రరీ పీరియడ్ ఎందుకు అ మలు చేయడం లేదన్నది ప్ర శ్నగా మిగిలిపోయింది. ఇతర పుస్తకాలు చదవడం వల్ల, ఆడుకోవడం వల్ల సమయం వృధా అవుతుందన్న ధోరణిలో ఇప్పటి పేరెంట్స్ పిల్లలను చదువుల పేరుతో శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు.

‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో ’ అన్న వీరేశలింగం పంతులు చెప్పిన మాటల స్ఫూర్తిని , పిల్లలకు ఇవ్వాల్సిన అత్యం త విలువైన బహుమతి ఒక మంచి పుస్తకమే అని విన్‌స్టన్ చర్చిల్ మాటల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటి పిల్లల్ని గ్రంథాలయాలకు, పుస్తక ప్రదర్శనలకు తీసుకెళ్లడం, ఇంట్లో ఒక మూలన రీడింగ్ కార్నర్‌ను ఏర్పాటు చేయ కపోవడం వల్ల మానసిక వేదన అనుభవిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బడి లో, కాలేజీల్లో, ఊర్లో, పట్టణాల్లో ఉన్న పౌర గ్రంథాలయాలను బలోపేతం చేయాలని, గ్రంథాలయాల అభివృద్ధికి ఖర్చు చేయడానికి నిధులివ్వాలని, స్కూళ్లు, కాలేజీల్లో లాంగ్వేజ్ టీచర్స్ విధిగా రీడింగ్ కార్నర్స్ ఏర్పాటు చేసి, విద్యార్థులతో ప్రతీరోజు ఒక పీరియడ్ పుస్తకాలు చదివించే ప్రక్రియలు చేపట్టడానికి మరో గ్రంథాలయ ఉద్యమం అవసరం.

గ్రంథాలయాలు అనేవి కేవలం పోటీ పరీక్షలకు మాత్రమే కాకుండా ఇతర సాహిత్యాన్ని చర్చించే విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లేలా కోరుతుంది. దశాబ్దాల కిందటే  గ్రంథాలయ ఉద్యమాన్ని సమాజానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి వట్టికోట అళ్వారు స్వామి. తెలంగాణలో నెత్తిన పుస్తకాల మూట పెట్టుకొని గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టి, దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి, సా మాన్య ప్రజల్లో పుస్తక పఠనంతో విద్యార్జన పట్ల ఆసక్తి కలిగించడానికి గణనీయమైన కృషి చేశారు.

1915 నవంబర్ 1న నల్లగొండ జిల్లా నకిరేకిల్ ప్రాంతంలోని చెరువు మాదారంలో పుట్టిన వట్టికోట అళ్వారు స్వామి తన కడశ్వాస వరకు ఉద్యమాల నేతగానూ, రాతగాను తన స్ఫూర్తిని ప్రదర్శించారు. నేటి తరం విద్యార్థులు పుస్తక నేస్తాలుగా మారేందుకు మరో గ్రం థాలయ ఉద్యమానికి బాటలు వేయాలి.

కాసుల రవికుమార్, 9908311580