బంగారం మరో కొత్త రికార్డు తులం ధర రూ.74,340
హైదరాబాద్, ఏప్రిల్ 19: ఒకటి, రెండు రోజులపాటు స్థిరంగా ఉన్న బంగారం ధర శుక్రవారం మరో కొత్త రికార్డుస్థాయికి చేరింది. ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులు జరిపిందన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో వువ్వెత్తున ధర పెరగడంతో శుక్రవారం హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర మరో రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరి కొత్త రికార్డును సృష్టించింది. నగరంలో ఈ స్థాయికి బంగారం చేరడం ఇదే ప్రధమం. 22 క్యారట్ల పుత్తడి తులం ధర రూ.500 పెరుగుదలతో రూ.68,150 వద్ద పలుకుతున్నది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు పుత్తడి ఫ్యూచర్స్ ధర 2,420 డాలర్ల వద్దకు చేరింది.
ప్రపంచ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగా బంగారం ధర పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ అనలిస్ట్ సౌమిల్ గాంధి తెలిపారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు పెరిగితే పుత్తడి ధర మరింత పరుగులు తీస్తుందని చెప్పారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఏర్పడే పరిణామాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లకు సంబంధించిన వార్తలకు అనుగుణంగా రానున్న రోజుల్లో బంగారం కదలికలు ఉంటాయని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది అభిప్రాయం వ్యక్తం చేశారు.






