ఎల్‌ఐసీ, జీఐసీలో వాటా విక్రయానికి కేంద్రం సిద్ధం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: రెండేండ్ల క్రితం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)లో వాటాల్ని విక్రయించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో విడత అమ్మకానికి సిద్ధమవుతున్నది. ఇన్వెస్టర్ల ఆసక్తిని విశ్లేషించుకుని ఎల్‌ఐసీతో పాటు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీ)లో వాటా విక్రయించనున్నట్టు ప్రభుత్వ ఆధికారి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థకు శుక్రవారం తెలిపారు. జీఐసీకి జరిపిన రోడ్‌షోలలో ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించిందని, దాని షేరు విలువల ఆధారంగా దశలవారీగా 10 శాతం వాటా ఆఫ్‌లోడ్ చేయనున్నట్టు ఆ అధికారి వివరించారు. జీఐసీ షేరు శుక్రవారంనాటి ముగింపు ధర ప్రకారం 10 శాతం వాటాకు రూ.5,700 కోట్లు ప్రభుత్వ ఖజానాకు సమకూరుతుందని అంచనా.
ఎల్‌ఐసీ 2022లో లిస్టయినప్పటి నుంచి ఏడేండ్లలో 10 శాతం, పదేండ్లలో 25 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. ఎల్‌ఐసీ షేరు ప్రదర్శన, ఇన్వెస్టర్ల ఆసక్తికి అనుగుణంగా ఎల్‌ఐసీ వాటాల్ని చిన్న చిన్న మొత్తాల్లో ఆఫ్‌లోడ్ చేయనున్నట్టు తెలిపారు. శుక్రవారం ఎల్‌ఐసీ షేరు రూ.973 వద్ద ముగిసింది. ఎల్‌ఐసీ తొలి పబ్లిక్ ఆఫర్‌లో 3.5 శాతం వాటాను విక్రయించగా, ఈ కంపెనీ ఇండెక్స్ ఫండ్స్‌లో చేరేందుకు వీలుగా మరో 1.5 శాతం వాటాను అమ్మాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. 1.5 శాతం వాటాను విక్రయిస్తే ప్రస్తుత షేరు ధర ప్రకారం ప్రభుత్వం రూ.9,200 కోట్లు సమీకరిస్తుంది.






