27 April, 2026 | 1:13 PM

కేసీఆర్‌కు మరో నోటీసు

26-06-2024 01:08 AM

27 లోపు వివరణ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశం

19వ తేదీనే రెండో నోటీసిచ్చిన కమిషన్

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్తు రంగంలో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్న జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు రెండోసారి నోటీసు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్  నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లో అక్రమాలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ ఇప్పటికే ఒకసారి కేసీఆర్‌కు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. దానికి ఈ నెల 15న దాదాపు 12 పేజీల వివరణతోకూడిన లేఖను కేసీఆర్ కమిషన్‌కు రాశారు. కమిషన్‌కు విచారణార్హతే లేదని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కమిషన్ తప్పుకోవాలంటూ అందులో విన్నవించారు. దీనిని పరిశీలించిన కమిషన్ 19వ తేదీన రెండోసారి నోటీసులు జారీచేసింది. 

27 లోగా వివరణ ఇవ్వండి

తాజాగా విచారణ కమిషన్ నుంచి మాజీ సీఎం కేసీఆర్‌కు అందిన నోటీసులో పేర్కొన్న అంశాలపై ఈ నెల 27వ తేదీ లోపు హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టంగా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయన రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌లోనూ తనకు ఈ నెల 19 తారీఖున విచారణ కమిషన్ నుంచి రెండోసారి లేఖ అందినట్టు కోర్టుకు విన్నవించారు. రెండోసారి నోటీసులను మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు.. మాజీ విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి, మరికొందరికి జారీచేశారని సమాచారం. ఇప్పటివరకు చేసిన విచారణలో కమిషన్ దృష్టికి వచ్చిన సమాచారంపై అభిప్రాయం చెప్పాలని రెండో నోటీసులో కమిషన్ పేర్కొన్నట్టు సమాచారం. పైగా సదరు సమాచారానికి సంబంధించిన సాక్ష్యాలను అందించాలని కమిషన్ పేర్కొంది.