‘విద్యుత్తు’ కమిషన్‌ను కొట్టేయండి
- ఈ కమిషన్ ఏర్పాటు చట్ట వ్యతిరేకం
- విచారణపై వెంటనే స్టే ఇవ్వండి
- హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్
- జస్టిస్ నరసింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చటంపై రిజిస్ట్రీ అభ్యంతరం
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకొన్న విద్యుత్ ఒప్పందాలతోపాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో అక్రమాలపై విచారణకు ప్రస్తుత ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దుచేయాలని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ విచారణపై తక్షణమే స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మంగళవారం కోరారు.
కమిషన్ ఏర్పాటు చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని, దానిని రద్దు చేసేందుకు తుది ఉత్తర్వులు జారీ చేయాలని విన్నవించారు. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏకసభ్య కమిషన్‌తోపాటు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి (వ్యక్తిగత హోదాలో)ని ప్రతివాదులుగా చేర్చారు. అయితే, రిటైర్డ్ న్యాయమూర్తిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చటంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం లేవెనెత్తారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు పరిపాలనాధికారి అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే దృష్టికి తీసుకువెళ్లేందుకు మంగళవారం సమయం మించిపోయింది. దీంతో ఈ వ్యవహారం బుధవారం చీఫ్ జస్టిస్ దృష్టికి వెళ్లాక గురువారం రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను రద్దు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
కమిషన్ ఏర్పాటు చట్ట వ్యతిరేకం
విద్యుత్ చట్టం 2003 ప్రకారం, విద్యుత్ వ్యవహారాలపై సమీక్ష చేసి నిర్ణయాలు వెలువరించేందుకు న్యాయ పరమైన రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఎస్‌ఈఆర్సీ) బహిరంగ విచారణలను నిర్వహించి ప్రజాభిప్రాయాలు స్వీకరిస్తుందని కేసీఆర్ తన పిటిషన్‌లో గుర్తుచేశారు. ఎస్‌ఈఆర్సీ నిర్ణయాలను విబేధించిన వాళ్లు ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో అప్పీల్ కమిషన్‌ను ఆశ్రయించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏకపక్షంగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసిందని ఆరోపించారు. అప్పిలేట్ అథారిటీలో వాదనలు వీగిపోయినా, ఆ అథారిటీ ఇచ్చే తీర్పుతో సంతృప్తి వ్యక్తం చెందకుంటే సుప్రీంకోర్టులో సవాలు చేసే వెసులుబాటు చట్టంలో ఉందని తెలిపారు. వీటన్నింటిని తుంగలోకి తొక్కి విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు.
కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో పలు విచారణ అంశాలు వెల్లడించడంపై కూడా కేసీఆర్ అభ్యంతరం చెప్పారు. విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు చెప్పడంద్వారా గోప్యత పాటించాలనే నిబంధనను కమిషన్ ఉల్లంఘించిందని వాదించారు. యాదాద్రి, భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆయా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందో సమగ్ర వివరాలతో కమిషన్‌కు లేఖ రాసినప్పటికీ విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చిందని తెలిపారు. తమ అభ్యంతరాలను తెలియజేసినప్పటికీ కమిషన్ నుంచి సానుకూల పరిస్థితులు లేవని, అందుకే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. తక్షణమే కమిషన్ విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని, విచారణ కమిషన్‌ను రద్దు చేసేందుకు తుది ఉత్తర్వులు జారీ చేయాలని కేసీఆర్ తన పిటిషన్‌లో హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌కు హైకోర్టు నంబర్ కేటాయించాల్సి ఉన్నది.
ముందే తీర్పు ఇచ్చేసిన కమిషన్
చట్ట ప్రకారం ఎస్‌ఆర్సీ వంటి జ్యుడీషియల్ సంస్థ విచారించిన అంశంపై మళ్లీ ఎలాంటి విచారణ అవసరంలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళాల్సిన కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి.. ఆ పని చేయలేదని కేసీఆర్ విమర్శించారు. పైపెచ్చు ఒప్పందాలపై వివరణ ఇవ్వాలని తనకు నోటీసు జారీ చేశారని అన్నారు. సమాధానమిచ్చేందుకు ఎన్నికల ప్రచారం తదితర కారణాల వల్ల గడువు తీసుకున్నానని, ఆ లోపే జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం సరికాదని తెలిపారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకొనే నాటికి పవర్‌ప్లాంట్లు లేవని, భద్రాద్రి ప్రాజెక్టులో సబ్ క్రిటికల్ సాంకేతికతను వినియోగించడం ద్వారా దాదాపు రూ.300 కోట్లు నష్టం వాటిల్లిందని కమిషన్ తన నిర్ణయాన్ని తేల్చి చెప్పేశారని కేసీఆర్ తన పిటిషన్‌లో తెలిపారు.
ఈ వివరాలు రికార్డులకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. నోటీసుకు సమాధానం ఇవ్వకముందే నిర్ణయాలను ప్రకటించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని వాదించారు. దీన్నిబట్టి చూస్తే జస్టిస్ నరసింహారెడ్డి నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని తెలుస్తోందని అన్నారు. ముందే తీసుకున్న నిర్ణయాలను వెల్లడించడాన్ని చూస్తే విచారణ నామమాత్రమేనని, అందువల్ల కమిషన్‌కు వివరాలను సమర్పించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. విచారణ ప్రక్రియ మొత్తం చట్ట వ్యతిరేకంగా కొనసాగుతోందని ఆరోపించారు.
ఎస్‌ఈఆర్సీ ఆదేశాలను సవాల్ చేయలేరు
విద్యుత్తు చట్టం 2003 కింద ఏర్పాటైన ఎస్‌ఈఆర్సీ సమగ్ర విచారణ జరిపి ఉత్తర్వులు జారీచేసే న్యాయవ్యవస్థ అని కేసీఆర్ వాదించారు. ఎస్‌ఈఆర్సీ జారీచేసిన ఉత్తర్వులకు రక్షణ ఉంటుందని, వాటిని ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, ట్రైబ్యునల్, కమిషన్, సభ్యులెవరూ ప్రశ్నించడానికి వీల్లేదని తెలిపారు. ఈఆర్సీ పరిధిలోని అంశాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అది నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణలో చెప్పవచ్చునని.. ఈఆర్సీ నిర్ణయంపై సంతృప్తి చెందని వాళ్లు అప్పీలేట్ ట్రైబ్యునల్‌ను, ఆ ట్రైబ్యునల్ ఇచ్చే ఉత్తర్వులను విబేధించేవారు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు చట్టంలో వెసులుబాటు ఉందని గుర్తుచేశారు. విద్యుత్తు చట్ట ప్రకారం అనుసరించాల్సిన ఈ విధానాన్ని విస్మరించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఉత్పత్తి, సరఫరా, పంపిణీ అన్ని అంశాలపై ఎస్‌ఈఆర్సీ పరిధిలోనే విచారణ చేపట్టాలని అన్నారు. ఇక్కడ తప్ప ఎక్కడా విచారణ చేపట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు గుజరాత్ ఊర్జా వికాస్ వర్సెస్ ఏఆర్ పవర్ లిమిటెడ్ కేసులో కీలక తీర్పు చెప్పిందని గుర్తుచేశారు.
వివరాలు తెలుసుకోకుండానే నిర్ణయాలా?
దక్షిణాది రాష్ట్రాలన్నీ విద్యుత్తు కొరతతో బాధపడుతున్న సమయంలో టీఎస్‌ఎస్పీడీసీఎల్ విచారణ జరిపి ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే మిగులు విద్యుత్తు ఉండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిందని కేసీఆర్ తెలిపారు. విద్యుత్తు సరఫరాకు ఆ రాష్ట్రం అంగీకరించడంతో రాబోయే మార్వా ప్లాంట్ నుంచి విద్యుత్తు సరఫరాకు 2014లో తెలంగాణ పభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని గుర్తుచేశారు. వాస్తవానికి తమిళనాడు ప్రభుత్వం యూనిట్‌కు రూ.4.94, కర్ణాటక రూ.4.33కు కొనుగోలు చేస్తుండగా తెలంగాణ మాత్రం రూ.3.90గానే నిర్ణయించిందని తెలిపారు.
మార్వా ప్లాంట్ పనులు పూర్తవుతున్న దశను పరిగణనలోకి తీసుకుని 2015 సెప్టెంబర్‌లో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇవేవీ ప్రస్తావించకుండా మార్వా ప్లాంట్ 2016 మార్చిలో వచ్చిందని, పవర్ ప్లాంట్ లేకుండానే విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకోవడం సరికాదంటూ జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటైనపుడు జాతీయ గ్రిడ్‌తో అనుసంధానం కాలేదని, దక్షిణాదిలో ౫ రాష్ట్రాలు మాత్రమే అనుసంధానమై ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణకు గ్రిడ్ సంధాన సౌకర్యం లేకపోవడంతో లైన్ ద్వారా విద్యుత్తు సరఫరాకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఎల్) అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. అంతర్ రాష్ట్రాల మధ్య విద్యుత్తు సరఫరా వ్యవస్థ నియంత్రణకే ఈ సంస్థ ఏర్పాటైందని గుర్తుచేశారు. పీజీసీఐఎల్‌తో చర్చించి టీఎస్‌ఎస్పీడీసీఎల్ ప్రత్యేక కారిడార్‌ను బుక్ చేసుకుందని వివరించారు. భద్రాద్రి ప్రాజెక్టుకు పర్యావరణ చట్టంతోపాటు అన్ని అనుమతులను తీసుకున్నాకే నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజాప్రయోజనాలకు చెందిన అంశాలుంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉండగా గత ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని విమర్శించారు. కమిషన్‌ను ఏర్పాటు చేసే పరిధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అందువల్ల కమిషన్‌ను ఏర్పాటు చేసిన జీవోను కొట్టివేయాలని హైకోర్టును కోరారు.
నాడు రేవంత్ అప్పీల్ చేయలేదు
విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఛత్తీస్‌గఢ్ వాసులతోపాటు అప్పటి తెలంంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి కూడా ఎస్‌ఈఆర్సీలో అభ్యంతరాలు దాఖలు చేశారని కేసీఆర్ తన పిటిషన్‌లో గుర్తు చేశారు. వారందరి వాదనలు విన్న తర్వాత ఎస్‌ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. విద్యుత్తు కొనుగోలు, టారిఫ్‌లకు సంబంధించి డిస్కంలు అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా, రేవంత్‌రెడ్డి మాత్రం అప్పీల్ చేయలేదని గుర్తుచేశారు. డిస్కంలు దాఖలు చేసిన అప్పీల్స్ పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈఆర్సీ నిర్ణయంపై నాడు అప్పీల్‌కు వెళ్లకుండా ఊరుకొన్న రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి కాగానే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కమిషన్‌ను ఏర్పాటు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని అన్నారు.






