24 March, 2026 | 12:36 AM

వలస కూలీలపై మరో ఉగ్రదాడి

02-11-2024 12:24 AM
  1. ఇద్దరు యువకులకు గాయాలు
  2. 12 రోజుల్లో ఇది రెండో దాడి

జమ్మూకశ్మీర్, నవంబర్1 : జమ్మూకశ్మీర్‌లో వలస కూలీలపై మరోసారి తూట పేలింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోఫియాన్(25), ఉస్మాన్ మాలిక్(20)లపై సెంట్రల్ కశ్మీర్‌లోని మగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు శుక్రవారం దాడులు జరిపారు. దాడిపై సమాచారం అందుకున్న భద్రతాబలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదులను వెతకడంలో నిమగ్నమయ్యాయి.

దాడిలో గాయపడ్డ ఇద్దరు యువకులను చికిత్స కోసం శ్రీనగర్‌లోని జేవీసీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. గత కొన్ని రోజులుగా జమ్మూకశ్మీర్‌లో వలస కూలీలే టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. 12 రోజుల క్రితం జరిగిన దాడిలో ఓ డాక్టర్ సహా ఆరుగురు వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు.