రైతుల కష్టం వర్షార్పణం
- అకాల వర్షాలతో తడిసిన జొన్న, మొక్కజొన్న పంటలు
- ప్రభుత్వ అలసత్వంతోనే పంట కొనుగోలు ఆలస్యమైందని రైతుల ఆరోపణ
- తడిసిన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే పాయల్
ఆదిలాబాద్/నేరడిగొండ, మే 7(విజయక్రాంతి) : ఆరుగాలం కష్టించి రైతులు పండిం చిన పంట అకాల వర్షానికి తడిసిపోవడంతో వారి కష్టం వర్షార్పణం అయింది. జిల్లాలో పంట సాగుకు విత్తనం వేసిన నాటి నుంచి పంటను అమ్ముకునే వరకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో గురువారం కురిసిన అకాల వర్షంతో మార్కెట్ యార్డులో అమ్మకానికి తెచ్చి నిల్వ ఉంచిన జొన్న, మొక్కజొన్న పంటలు తడిసిపోయాయి.
గత రెండు రోజుల క్రితమే పునః ప్రారంభమైన కొనుగోళ్లతో రైతులు సంతోషంతో పంటలను పెద్ద ఎత్తున మార్కెట్ తీసుకువచ్చారు. అంతలోనే అకాలవర్షం రూపంలో వారి పంట నీటమునిగింది. ఒక్కసారిగా ఈదురుగాలుళ్లకు తోడుగా భారీ వర్షం కురియడంతో ఆదిలాబాద్, నేరడిగొండ మార్కెట్ యార్డ్‌లో జొన్న, మొక్క జొన్న సంచులు పూర్తిగా తడిసి పోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అటు భారీ వర్షానికి మార్కెట్ యా ర్డులో ప్రహరీ గోడ కూలిపోయింది.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ మార్కెట్ యార్డ్‌కు వెళ్లి తడిసిన పంటలను పరిశీలించారు. రైతులు అధైర్యపడవ ద్దని, తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా తనవంతు కృషి చేస్తానని భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించడంతోనే రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు.
ప్రభుత్వం ఆలస్యం చేయడంతో అకాల వర్షాల వల్ల మార్కెట్‌లో నిల్వ ఉంచిన పంటలు తడిసిపోతున్నాయని ఆరోపించారు. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతున్న తరు ణంలో రబీలో రైతులు పండించిన పంటను ప్రభుత్వం ఎప్పుడు కొంటుందని, కొన్న పం టకు డబ్బులను వారి ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారని ప్రశ్నించారు.






