1 July, 2026 | 6:22 PM

Breaking News

గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •   రైతు భరోసా చారిత్రక ఘట్టం.. రైతుల కోసం లక్ష కోట్ల వ్యయం: ఎమ్మెల్యే రాగమయి   •   ఇల్లందు టీడీపీ కార్యకర్తను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు   •   మెరుగైన వైద్యం అందించాలి   •   ధర్మారంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ   •  

కోతలు ముమ్మరం.. కొనుగోలులో తీవ్ర జాప్యం

08-05-2026 12:00 AM

మద్దతు ధర దక్కక నష్టపోతున్న  మొక్కజొన్న రైతులు

కల్వకుర్తి మే 7 : రోజుల తరబడి ధాన్యం విక్రయానికి రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరుగాలం కష్టించి పండించి న మొక్కజొన్న పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినప్పటికీ, అందుకు అనుగుణంగా అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వేధిస్తున్న గన్ని సంచుల కొరత 

మార్క్ఫెడ్ ద్వారా పీఏసీఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ గన్ని సంచుల కొరత, కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు సరిపడ గోదాములు లేకపోవడంతో కొనుగోలు ప్రక్రియ లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2400 రైతులకు పూర్తిస్థాయిలో అందడం లేదు.హమాలీ, రవాణా ఖర్చులు అధికంగా ఉండటంతో పాటు సకాలంలో దిగుమతులు జరగక రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.

దీంతో అనేక మంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు మొక్కజొన్న విక్రయిస్తున్నారు. మరికొందరు   రూ.25 నుంచి రూ.30 వరకు చెల్లించి బయట గన్ని బ్యాగులను కొనుగోలు చేస్తున్నారు , ధాన్యం నింపినచోట అమాలికి బస్తాకు రూ 25లు, దిగుమతి వద్ద కూడా ఒక్కో బస్తాకు అదనంగా రూ.5 వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒక క్వింటాల్కు సుమారు రూ.200 నుంచి రూ.300 వరకు అదనపు భారం పడుతోందని తెలిపారు.మండలానికి ఒకే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులు అధికారులు సూచించిన గోదాములకు ధాన్యం తరలించాల్సి వస్తోంది.

అక్కడ దిగుమతికి నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతుండటంతో రవాణా ఖర్చులు మూడింతలు అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. రాత్రింబవళ్లు రోడ్లపైనే గడుపుతున్నప్పటికీ, గోదాముల్లో స్థలం లేదంటూ ఒకచోటు నుంచి మరొకచోటుకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి వెళ్లాక మళ్లీ వరుసలో నిలబడాల్సి రావడంతో మరింత సమయం వృథా అవుతోంది. ఒక ట్రాక్టర్ ధాన్యం దిగుమతికి సుమారు వారం రోజుల సమయం పడుతోందని రైతులు చెబుతున్నారు.

దీంతో అద్దె ట్రాక్టర్లపై ధాన్యం తీసుకువచ్చిన రైతులు కిరాయిలు చెల్లించలేక సతమతమవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు సమీపంలోని గోదాములకే ధాన్యం తరలించేలా చర్యలు తీసుకోవాలని, గన్ని సంచులు సకాలంలో అందించి రైతులపై పడుతున్న అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు.