20 June, 2026 | 2:36 AM

శివసేనకు మరో పరీక్ష!

20-06-2026 12:00 AM

మరాఠాల అస్తిత్వ ప్రతీకగా చెప్పుకొనే శివసేన పార్టీ మరోసారి తన అస్తిత్వం కోసం పోరాడుతున్నది. నాలుగేళ్ల క్రితం అంతర్గత తిరుగుబాటుతో అతలాకుతలమైన శివసేన ఇప్పుడు మళ్లీ సంక్షోభాన్ని ఎదు ర్కొంటున్నది. గతంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలో వేరుకుంపటి పెట్టుకొని పార్టీని, గుర్తును కైవసం చేసుకోగా; ఇప్పుడు ఎంపీలు చీలిక వర్గంగా ఏర్పడి శివసేన (యూబీటీ) భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు.

అయితే, ఒకటికి రెండుసార్లు ఇలాంటి పరిణామాలు జరగడంతో ఈ చీలికలు నాయకత్వంపై అసంతృప్తికి నిదర్శనమా? లేక వీటి వెనుక ప్రత్యర్థి రాజకీయ శక్తుల హస్తం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మరాఠా ప్రజల అస్తిత్వం, ఆత్మగౌరవం, భాషాధా పరిరక్షణ లాంటి మహోన్నత ఆశయాలతో మరాఠాల ఆరాధ్యుడు బాల్ థాక్రే 1966లో శివసేన పార్టీని స్థాపించిన విషయం విదితమే. కాలక్రమేణా ఆ పార్టీ హిందూత్వ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని కీలక రాజకీయ మలుపు తీసుకున్నది.

బాల్ థాక్రే చేసిన ఉద్యమాల ఫలితంగా శివసేన అనతికాలంలోనే మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన శక్తిగా ఎదిగింది. అయితే, 2012లో బాల్ థాక్రే మరణంతోపాటే ఆయన సిద్ధాంతాలకు కూడా శివసేన నీళ్లొదిలేసింది. ఆ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన ఆయన కుమారుడు ఉద్ధవ్ థాక్రే భావజాల సారూపత్య ఉన్న బీజేపీతో అత్యధిక కాలం కలిసి పనిచేసినప్పటికీ, అధికారం కోసం సైద్ధాంతిక వైరుద్ధ్యమున్న పక్షాలతో జతకలిశారు.

ఇదే శివసేన కొంపముంచింది. వైరిపక్షాలతో పొత్తును నిరసిస్తూ నాయకత్వంతో విభేదించిన ఏక్‌నాథ్ షిండే తిరుగుబావుటా ఎగురవేయడంతో ఇటు పార్టీని, అటు గుర్తును ఉద్ధవ్ కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆరుగురు ఎంపీల వలసల రూపంలో ఉద్ధవ్ నాయకత్వానికి మరో పరీక్ష ఎదురైంది. అయితే, పార్టీలో అంతర్గత అసంతృప్తి, నాయకత్వంపై బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ, గతంలో చెప్పినట్టు ఈసారి సైద్ధాంతిక విరుద్ధమైన పొత్తులు లేకపోవడంతో వేళ్లన్నీ రాజకీయ ప్రత్యర్థుల వైపే వెళ్తున్నాయి.

ఈ సంక్షోభాన్ని ఒక పార్టీ సమస్యగా మాత్రమే కాకుండా భారత రాజకీయాల్లో పెరుగుతున్న ఫిరాయింపు రాజకీయాలకు నిదర్శనంగా చూడాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్ర రాజకీయాల్లో మరోమారు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శివసేన కొత్త అధ్యా యంలోకి ప్రవేశిస్తున్నది.

ఈ నేపథ్యంలో బాల్ థాక్రే ఆశయాల పునాదులపై పార్టీని పునర్నిర్మించే అవకాశం శివసేన (యూబీటీ)కి మరోసారి లభించింది. ఈసారైనా ఆ పార్టీ మూలాల నుంచి ప్రక్షాళన చేసి బలపడుతుందా? లేక మరింతగా బలహీనపడి కనుమరుగవుతుందా? అన్నది చూడాలి.