పెద్దల విధ్వంసం.. పేదల బలి!
సంపతి రమేష్ :
పర్యావరణం అనేది మనిషి, జంతువులు, వృక్షాలతో పాటు ఇతర జీవరాశుల మనుగడకు ఆధారం. గాలి, నీరు, భూమి, అడవులు, నదులు, జీవ వైవిధ్యం వంటి ప్రకృతి వనరులు పర్యావరణంలో కీలకమైనవి. జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, సహజ వనరుల విచ్చలవిడి వినియోగం కారణంగా పర్యావరణం తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. గాలి,- నీటి కాలుష్యం, భూగర్భ జలాల క్షీణత, వాతావరణ మార్పులు, జీవవైవిధ్య నష్టం వంటి సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ పరిణామాలు కేవలం ప్రకృతికే కాకుండా మానవ ఆరోగ్యం, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ తరాల జీవన ప్రమాణాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అడవుల నరికివేత, గనుల తవ్వకాలు, పరిశ్రమల కాలుష్యం, భారీ ప్రాజెక్టుల పేరుతో ప్రకృతి ధ్వంసం వేగంగా జరుగుతోంది. దీంతో ఎండల తీవ్రత పెరగడం, అతివృష్టి, అనావృష్టి, ఎల్ నినో వంటి ప్రకృతి విపత్తులకు ఏ తప్పు చే యని పేదలు బలైపోతున్నారు. దీనికి ప్రభుత్వాలు, కార్పొరేట్ శక్తులే కారణం.
ఈ వినాశనం సహజసిద్ధంగా జరగడం లేదు. దీని వెనుక ఆధిపత్య కుల కార్పొరేట్ పెట్టుబడిదారులు, ప్రభుత్వాల మధ్య ఉన్న రాజకీయ, ఆర్థిక సంబంధాలే ప్రధాన కారణం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని కాపాడాల్సింది పోయి, పెట్టుబడిదారుల లాభాల కోసం ప్రకృతిని తాకట్టు పెడుతున్నాయి. అడవులను రక్షించాల్సిన ప్రభుత్వాలే కార్పొరేట్ కంపెనీలకు వేల ఎకరాల అటవీ భూములను అప్పగిస్తున్నాయి.
ముఖ్యంగా దళిత, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూములను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నాయి. ఇష్టారీతిన గనులు లీజుకు ఇస్తూ ఆదివాసుల జీవనాధారాలను నాశనం చేస్తున్నారు. ఇదం తా వ్యవస్థాగతంగా జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ దోపిడీ. ఇటీవల వికారాబాద్ జిల్లా, పరిగి మండలం, కాడ్లాపూర్ గ్రా మంలో ఇండస్ట్రియల్ పా ర్క్ కోసం 1400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీ నం చేసుకునే ప్రయత్నాలకు వ్యతిరేకంగా గ్రామ సర్పంచ్, ప్రజలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ భూముల పరిరక్షణ కోసం మొట్టమొదట బీసీ--, ఎస్సీ, -ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ పోరాటం నిర్వ హించారు. హైదరాబాద్ ఫార్మాసిటీ తెలంగాణలో అత్యంత వివాదాస్పద పారిశ్రామిక ప్రాజెక్టులలో ఒకటి. ఇప్పటికే పటాన్‌చెరు, జీడిమెట్ల, బొల్లారం ప్రాంతాలు ఔషధ పరిశ్రమల కాలుష్యంతో దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే నారాయణపేట జిల్లాలోనీ చిత్తనూరూలో, కామారెడ్డి జిల్లాలోనీ లింగంపల్లిలోనూ ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల జరుగుతున్న వాయు కాలుష్యంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా ప్రపంచ ప్రసిద్ధి చెందిన టాన్ బ్రౌన్ గ్రానైట్ నిల్వలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ గ్రానైట్ తవ్వకాలు, కట్టింగ్, పాలిషింగ్ యూనిట్ల నుంచి వెలువడే దుమ్ముతో చుట్టుపక్కల గ్రామాల్లో కాలుష్యం తీవ్రత పెరుగుతున్నది. సు ప్రీంకోర్టు ‘వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందడం’ భారత ప్రజల ప్రాథమిక హక్కు అని ప్రకటించింది. ఈ హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 21 (జీవించే హక్కు) నుండి ఉద్భవిస్తుందని పేర్కొంది.
చారిత్రకంగా జీవ వైవిధ్యాన్ని కాపాడేది స్థానిక సమాజాలే. గిరిజనులు, దళితుల భూములను లాక్కొని, వారిని అభివృద్ధి పేరుతో తరిమివేస్తున్నారు. ఇది సామాజిక న్యాయ సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రకృతి వినాశనంతో మొదట నష్టపోయేది పేదలే. కానీ, లాభాలు పొందేది కార్పొరేట్ వర్గాలు. ప్రకృతి వ్యాపార వస్తువు కాదు, అది భవిష్యత్ తరాల జీవన హక్కు. ఆ హక్కును కాపాడాలంటే ప్రజల్లో వాతావరణ స్పృహ, రాజ్యాంగ చైతన్యం పెరగాలి. అప్పుడే ఆధిపత్య వర్గాల స్వార్థప్రయోజన రాజకీయాలు అంతమై ప్రకృతి విధ్వంసం ఆగుతుంది.
వ్యాసకర్త: సామాజిక విశ్లేషకులు, 7989579428






