కవితా ముకురం రామారెడ్డి
ఆచార్య మసన చెన్నప్ప :
పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి ఒక తాలూకగా ప్రసిద్ధి పొందింది. కల్వకుర్తిలో కవులెక్కువగా ఉన్నందున ‘కవులకుర్తి’ అని దానికి పేరు. ఈ కల్వకుర్తి తాలూకాలోనే జానపద సాహిత్యానికి అత్యంత సేవచేసిన మహానుభావులు, ఆధ్యాత్మికవేత్తలు జన్మించారు. ‘అప్పకవీయం’ రచించిన కాకునూరి అప్పకవి ఇక్క డివారే. యెల్దండ రఘుమన్న, కసిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడివారే.
డాక్టర్ ముకురాల రామా రెడ్డి కూడా ఈ తాలూకా వారే. ‘ముకురాల’ గ్రామంలో జన్మించిన మందా రామారెడ్డి ఊరి పేరే ఇంటి పేరైంది. ‘ముకురం’ అంటే అద్దం. సంస్కృతంలో దీనికి ‘ఆదర్శం’ అని మరొక పేరు ఉంది. బహుశా ఆ గ్రామం వారు ఇతరులకు ఆదర్శంగా ఉంటారు గనుక, ఆ గ్రామానికి ‘ముకురాల’ అనే పేరు
సార్థకమైంది.
అది 1971వ ప్రాంతం. ముకురాల రామారెడ్డి తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్నారు. నాకు వారితో ఎక్కువగా పరి చయం లేదు. కానీ, వారిని సభల్లో చూశా ను. కల్వకుర్తి వాస్తవ్యులని మాత్రం తెలుసు. అనుకోకుండా ఒకరోజు డా.రామారెడ్డి, వారితో పాటు తెలుగు అకాడమీలో పనిచేస్తున్న ప్రముఖ కవి ఉత్పల సత్యనారాయ ణాచార్యులు నేను చదువుకుంటున్న ఆంధ్ర సారస్వత పరిషత్తుకు వచ్చారు. వారు కేవ లం పరిషత్తును చూడటానికి రాలేదు.
పరిషత్తులో జరిగే అంత్యాక్షరి పద్య పోటీకి వారి ని న్యాయనిర్ణేతలుగా వ్యవహరించడానికి మా ప్రధానాచార్యులైన కేకే రంగనాథాచార్యులే ఆహ్వానించారు. నేను డిప్.ఓ.ఎల్ చదువుతున్నాను. తెలు గు ప్రాచ్య విద్యార్థులం కాబట్టి ఎక్కువగా పద్యం అంటే ఇష్టపడడమేగాక, వందలాది పద్యాలను కంఠస్థం చేసిన విద్యార్థులు పరిషత్తు కళాశాలలో ఎందరో ఉన్నారు.
సాయంకాలం కళాశాల కాబట్టి, అంత్యాక్షరి పద్య పోటీ సాయంత్రమే ఆరంభమైంది. ఆ పోటీలో సుమారు నలబై మంది విద్యార్థు లు పాల్గొన్నట్టు జ్ఞాపకం ఉంది. ఆ విద్యార్థులలో నాకు సీనియర్ ముంతాజ్ బేగం కూడా ఉన్నారు. వారికి నోటికి వచ్చినన్ని పద్యాలు ఇంకెవరికీ రావంటే అతిశయోక్తి కాదు.
ఆనాటి అంత్యాక్షరి పోటీలో ఆమెకు ప్రథమ బహుమతి లభించింది. నాకు ద్వితీ య బహుమతి లభించింది. నాకప్పటికీ ఆశుపద్యాలు చెప్పడం అలవాటు కనుక కొన్ని పద్యాలు ఆశువుగా చెప్పినట్లు జ్ఞాపకం ఉంది. నేను ఆశువుగా పద్యాలు కొన్ని చెప్పినట్టు డా.ముకురాల రామారెడ్డి పసిగట్టారు. పోటీ పూర్తయిన తర్వాత వారు నన్నొకసారి తెలుగు అకాడమీకి రమ్మని చెప్పారు. నేనా మర్నాడే అకాడమీకి వెళ్లి మొదట ఉత్పల వారికి ప్రణమిల్లి, ఆ తర్వాత రామారెడ్డి గారిని దర్శించాను.
నన్ను చూడగానే రామారెడ్డి గారు కుర్చీ నుంచి లేచి ప్రేమతో కౌగి లించుకున్నారు. ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని చెప్పి తాము కాళిదాసు మహాకవి విరచితమైన ‘మేఘ సందేశ’ కావ్యానికి చేసిన ‘మేఘదూత’ అనే గేయానువాద కావ్యాన్ని అందజేశారు. నేను కుర్చీలోంచి లేచి వారి కావ్యాన్ని అందుకున్నాను. కవర్ పేజీ తెరిచి చూసి ఆశ్యర్యపోయాను. ‘చిరంజీవి చెన్నప్ప ఆశుకవితాభ్యాసానికి మెచ్చి’ అని రాసి ఉంది. కింద వారి సంతకం ఉంది.
‘చెన్నప్పా! నీది కూడా కల్వకుర్తి తాలుకా అని తెలిసింది. నా శిష్యుడు కసిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా నీ గురించి విన్నాను. నీవు పద్యాలు పాడడమేగాక, రాస్తావని, ఆశువుగా చెప్తావని నిన్న అంత్యాక్షరిలో నిరూపితమైంది. నీకు మంచి భవిష్యత్తు ఉంది’ అని దీవించారు.
ముకురాల, ఉత్పల ఇద్దరు మహానుభావులు డిప్యుటేషన్ మీద అకాడమీకి వచ్చా రు. ఉత్పల వారు తిరిగి తన లెక్చరర్ ఉద్యోగంలోకి మారారు. కానీ, రామారెడ్డి గారు అక్కడే పనిచేసి పదవీ విరమణ చేశారు. ఒక రోజు నారాయణగూడలో ఉన్న తన ఇంటికి రమ్మన్నారు. అప్పుడు వారు రచించిన ‘దేవరకొండ దుర్గం’ (పద్యగేయ కృతి)ని, ‘నవ్వే కత్తులు’ (జాతీయ విప్లవ కావ్యం), ‘పుట్టగోచి లింగ పూలరంగ’ అనే మకుటం గల్గిన శతకాన్ని ఇచ్చారు. ఈ పుస్తకాలను చాలా కాలం వరకు నా దగ్గర భద్రపరుచుకొని, అప్పుడప్పుడు చదవి ముకురాల వారి కవితా వైశిష్ట్యానికి, హాస్య వ్యంగ్య రచనా రీతికి పరవశించిపోయేవాణ్ని.
ముకురాల వారు మొదట పట్వారీగా పనిచేశారు. ప్రైవేటుగా చదివి విద్వత్తును సంపాదించారు. తెలుగు పండితునిగా అధ్యాపక వృత్తిలో ప్రవేశించిన వారు క్రమంగా స్కూల్ హెడ్‌మాస్టర్‌గా, తెలుగు ఉపన్యాసకులుగా పదోన్నతి పొందారు. చివరికి తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా తమ సేవలందించారు. వారి సంపాదకత్వంలోనే ‘పరిపాలన-న్యాయపదకోశం’, ‘సాహి త్య పదకోశం’ అకాడమీ ద్వారా వెలువడ్డాయి. రామారెడ్డిగారు ‘సాహిత్య సులోచ నాలు’ అనే వ్యాస సంపుటిని రచించారు. ‘సూత పురాణం’ వారి అద్భుతమైన తాత్పర్య గ్రంథం. ‘ముకురాల కథలు’ అనే పుస్తకం ఆబాలగోపాలాన్ని అలరించే కథల సంపుటి!
రామారెడ్డి గారు, గంగాపురం హనుమశ్శర్మ (దుందుభి కవి) గారిద్దరు కొంతకాలం జంటకవులుగా వన్నెకెక్కారు. ఆచార్య సి.నారాయణరెడ్డి పి.హెచ్‌డి పర్యవేక్షకుడైనప్పటికీ, రామారెడ్డిని మిత్రునిగానే చూశారు. అందుకే రామారెడ్డి గారు సినారెకు ‘దేవరకొండ దుర్గం’ కావ్యాన్ని అంకితం చేశారు. ముకురాల పద్య నైపుణ్యాన్ని మెచ్చిన కవుల్లో దాశరథి గారొకరు.
రామారెడ్డి గారు వ్యావసాయిక కుటుం బం నుంచి వచ్చినవారే కానీ, అభ్యుదయ భావాలు కలవారనటానికి ‘నవ్వే కత్తులు’ సాక్ష్యం.
“భూమి దున్నబోడు భూలక్ష్మి కామందు
భూమి దున్నకుండ భూమిలేలిరికదా
మనువు నాటి నుండి మావొ వరకు”
రాజులలో ఒక జనకుడు తప్ప, కవులలో ఒక్క పోతన తప్ప భూమి దున్నిన వారు లేరు. భూమిని దున్ని పంట పండించనివారే ఏలికలయ్యారని ముకురాల రామారెడ్డి చెప్పిన మాటలు పరమసత్యమనక తప్పదు.
నాగరికత గురించి వ్యంగ్యంగా ‘నవ్వే కత్తులు’లో చెప్పిన మాటలు యథార్థమైనవే.
‘కలము అరిగినవ్వె కత్తి విరిగినవ్వె
పాత కొత్త సందు ప్రకృతినవ్వె
ఏడిపించు మొండినీడిచి తన్నక
నవ్వె సిగ్గులేని నాగరికత”
‘పుట్టగోచి లింగ పూలరంగ’ శతకం హాస్యానికి, వ్యంగ్యానికి ఆలవాలమైంది. పుట్టగోచి లింగడు శివుడే.
“రామరామమన్న రాదా కడుపునొప్పి
వామవామయనుచు వామదినక
మందులేక పుండు మాటల మానునా?
పుట్టగోచిలింగ పూలరంగ”
మాటల కంటే చేతలే గొప్పవని, మనిషి వర్తమానంలో జీవించాలని, కష్టపడి ఇష్టపడి పనిచేసిననాడే ఫలితం లభిస్తుందని, మనిషికి సోమరితనమే పెద్ద రోగమని, ఉత్సాహంగా ఉరకలు వేసే గంగను ఆదర్శం(ముకురం)గా తీసుకోవాలని ప్రబోధిం చిన రామారెడ్డి చిరస్మరణీయులు!
వ్యాసకర్త సెల్: 9885654381






