24 April, 2026 | 3:17 PM

ఇన్ఫార్మర్ నెపంతో మరో మహిళ హత్య

09-12-2024 01:49 AM
  1. మూడు రోజుల వ్యవధిలో నలుగురిని హతమార్చిన మావోయిస్టులు
  2. జీడిపల్లి పోలీస్ క్యాంప్‌పై మెరుపుదాడి

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 8(విజయక్రాంతి): పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు శనివారం లక్ష్మీ అనే అంగన్‌వాడీ టీచర్‌ను హతమార్చి 24 గంటలు గడవకముందే మరో మహిళను హత్య చేశారు. గత మూడు రోజుల వ్యవధిలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా పరిధిలో మావోలు ఇద్దరు సర్పంచులతో పాటు ఇద్దరు మహిళలను హతమార్చారు. దీంతో గిరిజన గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

బీజాపూర్ జిల్లా మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని లోడెడ్ గ్రామానికి చెందిన సుక్ర యాలంను ఆమె భర్త రామయ్యను ఈనెల 7న మావోలు కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లారు. తర్వాత రామయ్యను కర్రలతో విపరీతంగా కొట్టి వదిలివేశారు. అనంతరం ఆదివారం సుక్రయాలంను గొంతుకోసి హతమార్చారు. తెలగాణ పోలీసులకు ఆమె ఇన్ఫార్మర్‌గా వ్యవహరిస్తోందని, అందుకే హతమార్చామని మావోయిస్టులు ప్రకటించారు.

పోలీస్ క్యాంప్‌ెే2పై మెరుపుదాడి

ఆదివారం తెల్లవారుజామున బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరోసారి మెరుపుదాడికి దిగారు. పామేడు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న జీడిపల్లి పోలీస్ క్యాంప్ రాకెట్ లాంచర్లతో దాడికి తెగబడ్డారు. పోలీసులే టార్గెట్‌గా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అనుకోని ఘటనతో తేరుకున్న పోలీసులు నక్సలైట్లపై ఎదురు కాల్పులకు దిగారు. 

మావోయిస్టుల శిబిరం ధ్వంసం

ఛత్తీస్‌గడ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో డీఆర్జీ, బీఎస్‌ఎఫ్ జవాన్లు కూంబింగ్‌లో భాగంగా శనివారం మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేశారు. ఈ శిబిరంలో ఆయుధాలు తయారు చేసే మెషీన్లు, గ్యాస్, ఆక్సిజన్ సిలిండర్లు, డిటోనేటర్లు, భారీగా పేలుడు పదార్థాలు, సోలార్ ప్లేట్లు, కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం, నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నారు.