ప్రజాప్రభుత్వం రికార్డు పాలన
- ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను పునరుద్ధరించాం
- నాపై తెలంగాణ ప్రజలకున్న నమ్మకానికి కృతజ్ఞలు
- ‘ఎక్స్’లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందేశం
హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ప్రజాప్రభుత్వం తొలి ఏడాది రికార్డు పాలన సాగించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాలను సీఎం ‘ఎక్స్’లో ఆదివారం పోస్టు చేశారు.
రైతు రుణమాఫీ, సన్నాలకు బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో ప్రజాప్రభుత్వం రికార్డు సృష్టించిందని తెలిపారు. మహిళా సంక్షేమ పథకాలైన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, కులగణన, పర్యావరణ కేంద్రీకృతమైన పట్టణాభివృద్ధి విధానాల అమలును ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుంటున్నాయని వెల్లడించారు.
రైతు సంక్షేమానికి 25 లక్షల మంది అన్నదాతలకు రూ.2 లక్షల వరకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గుర్తుచేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్రంలోని పేదలకు 4.50 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నామని, ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీల నిర్మాణం, డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు చేపట్టామని వివరించారు.
రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి, హైదరాబాద్ ప్రగతి, మెట్రో రెండోదశ విస్తరణ, ఆర్‌ఆర్‌ఆర్ సహా కీలక రోడ్ల నిర్మాణం, ప్యూచర్ సిటీ నిర్మాణానికి చర్యలు తీసుకోవడంతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్లుతోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలను పునరుద్ధరణ చేశామని, ప్రజాపాలనలో ‘డిసెంబర్ 9న’ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నామని తెలిపారు. తనపై తెలంగాణ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కృతజ్ఞతలంటూ సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.






