30 July, 2026 | 9:44 PM

అనురాగ్‌పె కేసు

25-08-2024 01:21 AM
  • బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు.. ఎమ్మెల్యే పల్లా విద్యా సంస్థలపై కేసు 

ఘట్‌కేసర్, ఆగస్టు 24: చెరువు బఫర్ జోన్‌లో మెడికల్ కళాశాల, హాస్పిటల్ బహుళ అంతస్తుల భవనాలను నిర్మించిన జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, గాయత్రీ ఎడ్యుకేషనల్ ట్రస్టులపై కేసు నమోదయింది. పోచారం ఐటీ కారిడార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

ఇన్‌స్పెక్టర్  రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం, మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్‌లోని సర్వే నంబర్ 813లో ఉన్న నాడెం చెరువు బఫర్‌జోన్‌లో ఎమ్మెల్యే పల్లాకు చెందిన అనురాగ్ గ్రూఫ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, గాయత్రీ ఎడ్యుకేషనల్ ట్రస్టులు అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టినట్లు మండల ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పరమేశ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  వెంకటాపూర్‌లోని  నాడెం చెరువును మిషన్ కాకతీయ నాలుగో దశలో మరమ్మతులు చేపట్టినట్లు పేర్కొన్నారు.

చెరువు బఫర్ జోన్‌లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కళాశాల, హాస్పిటల్ భవనాలను నిర్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఆక్రమించిన బఫర్ జోన్ స్థలంలో నాలుగు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారని, దీనిపై అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, గాయత్రీ ఎడ్యుకేషనల్ ట్రస్టులపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఏఈ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

నాడెం చెరువు బఫర్ జోన్‌లో..  

బఫర్‌జోన్‌లో బహుళ అంతస్తుల భవనాలపై పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాతనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పరమేశ్ తెలిపారు. రెవెన్యూ అధికారులతో వెంటనే సర్వే జరిపించి ఎన్ని ఎకరాల బఫర్ జోన్ స్థలం ఉన్నది ప్రకటిస్తామని చెప్పారు. చెరువు విస్తీర్ణం 61 ఎకరాలు ఉందని, ఒక ఎకరంపైగా బఫర్ స్థలంలో నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు.

కక్ష పూరితంగానే కేసు నమోదు: పల్లా

అనురాగ్ విద్యా సంస్థలు బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు వచ్చిన ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, కక్ష పూరితంగా కేసు నమోదు చేసినట్లు అనురాగ్ విద్యా సంస్థల చైర్మన్, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మెడికల్ కళాశాల నిర్మాణాలు జరిగిన సర్వే నెంబర్లు 813/పి, 796/పి సంబంధించిన భూమి వ్యవసాయం నుంచి వ్యవసాయేతర భూమిగా(బి2/334/2019, తేది.03.04.20218) పొందినట్లు చెప్పారు. ఆ భూమికి సంబంధించి  ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖలు జాయింట్‌గా విచారణ చేసి, చెరువు ఎఫ్‌టీఎల్ నుంచి బఫర్ జోన్‌కు, బఫర్ జోన్ నుంచి సంబంధిత భూమికి దూరాన్ని కొలిచి బఫర్ జోన్‌లేదని తేల్చి చెప్పి మ్యాప్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. తర్వాత ఈ విషయమై జిల్లా స్థాయి కమిటీ అంగీకరించి హెచ్‌ఎండీఏ కమీషనల్ ఎన్‌వోసీ ఇవ్వటం ద్వారా అనుమతులు వచ్చాయన్నారు. అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతనే నిర్మాణాలు చేపట్టామని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే, కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నట్లు ఆరోపించారు. చట్ట పరిధిలోనే న్యాయం కోసం పోరాడుతానని ప్రకటనలో తెలిపారు.

చట్ట ప్రకారమే చర్యలుండాలి

ఎమ్మెల్యే పల్లా కేసులో హైడ్రాకు తేల్చిచెప్పిన హైకోర్టు

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెంకటాపూర్ గ్రామంలోని నాడెం చెరువు ఆక్రమణలతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ ఉన్నట్లయితే వాటిని చట్ట ప్రకారం తొలగింపు చర్యలు చేపట్టాలంటూ అధికారులకు శనివారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ముందస్తుగా నోటీసులు జారీచేసి వివరణ తీసుకున్నాక చర్యలు చేపట్టాలని తెలిపింది. ఆక్రమణల పేరుతో అధికారులు తమ ఆస్తు ల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీచేయాలంటూ గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీతోపాటు అనురాగ్ యూనివర్సిటీ తదితర విద్యాసంస్థలు శనివారం హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలుచేశారు.

దీనిపై న్యాయమూర్తి జస్టిస్ టీ వినోద్‌కుమార్ రాత్రి 9 గంటల ప్రాంతంలో విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డీ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 17.21 ఎకరాల్లో అన్ని అనుమతులు తీసుకుని విద్యా సంస్థలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2002లో అనురాగ్ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారని, అనురాగ్ ప్రైవేటు యూనివర్సిటీని నడుపుతున్నారన్నారు. 2016లో నీటిపారుదల శాఖ నుంచి ఎన్వోసీ తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ సర్వే నం.813 నివాస ప్రాంతంగా హద్దులు ప్రకటించిందన్నారు.

2017లో నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించి నాడెం చెరువు బఫర్‌జోన్ పరిధిలో వర్సిటీ స్థలం లేదని నివేదిక ఇచ్చారన్నారు. ఈ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఎన్వోసీ జారీచేశారన్నా రు.  అయితే ఈ నెల 22న నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు అధికారులతో కలిసి అనుమతి లేకుండా వర్సిటీ ఆవరణలోకి చొరబడి వివరాలు సేకరించారన్నారు. నీలిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన నిర్మాణాలు అందులో ఉన్నా యన్న నివేదిక ఆధారంగా నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజినీరు పోచారం ఐటీ సెక్టార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు.

హైడ్రాతో కలిసి నిర్మాణాలను కూల్చివేసే ప్రయత్నాలు రాజకీయ దురుద్దేశాలతో చర్యలు చేపట్టారన్నారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి, హైడ్రా తరఫున కటిక రవీందర్‌రెడి వాదనలు వినిపిస్తూ, ఎలాంటి చర్యలు చేపట్టకముందే కోర్టుకు వచ్చారన్నారు. నాడెం చెరువు బఫర్‌జోన్‌ను ఆక్రమించి అక్కడ నిర్మాణాలు చేపట్టినట్టు ఆధారాలున్నాయన్నారు. చట్టప్రకారమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.   వాదనలను విన్న న్యాయమూర్తి నాడెం చెరువులో అనురాగ్ యూనివర్సిటీ ఆక్రమణలున్నట్లయితే వాటి తొలగింపునకు చట్టప్రకారం చర్యలు చేపడతామన్న ప్రభుత్వ న్యాయవాది హామీని నమోదు చేస్తూ పిటిషన్ విచారణను మూసివేశారు.