సైబర్ నేరగాళ్లపై పోలీసుల ఉక్కుపాదం
- గుజరాత్‌కు చెందిన 36 మంది అరెస్ట్
- దేశవ్యాప్తంగా 983 కేసుల్లో నిందితులు
- హైదరాబాద్‌లో 20 కేసుల్లో రూ.12.49 కోట్లు మాయం
- భారీగా నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లపై నగర సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో హైదరాబాద్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు ఏడు బృందాలతో కీలక ఆపరేషన్ నిర్వహించి, 36 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. వీరిలో ఏడుగురు దేశవ్యాప్తంగా పలు కేసుల్లో కీలక నిందితులుగా ఉన్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి శనివారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 983 కేసుల్లో ఈ 36మంది నిందితులుగా ఉన్నారు.
అందులో తెలంగాణ వ్యాప్తంగా 101, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 30, ఇతర రాష్ట్రాల్లో 852 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. నిందితులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 20 సైబర్ మోసాల్లో రూ.12.49 కోట్లు కొల్లగొట్టారు. అందులో రూ.4.5 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు సీపీ తెలిపారు. రూ.1.51 కోట్లు బాధితులకు చెల్లించామని చెప్పారు. నిందితుల నుంచి రూ. 38.28 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, 64 మొబైల్ ఫోన్లు, 112 సిమ్ కార్డులు, 410 బ్యాంకు పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు, 64 డెబిట్ కార్డులు, 7 స్వైపింగ్ మిషిన్లు, 6 షేల్ కంపెనీ స్టాంప్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు.
రూ.2కోట్లు పోగొట్టుకున్న బాధితుడు
ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 500 శాతం లాభాలు పొందవచ్చునని నగరానికి చెం దిన ఓ వ్యాపారి(55)కి వాట్సప్‌లో మేసేజ్ వచ్చిం ది. బాధితుడు మొదట్లో కొద్ది మొత్తం లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలను పొందా డు. ఆ తర్వాత పలు దఫాలుగా రూ.2 కోట్ల వరకు పెట్టుబడులుగా పెట్టాడు. అనంతరం వారి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన సైబర్ క్రైమ్ పోలీసు లకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుజరాత్‌కు చెందిన చుడా సమ కుల్దీప్‌సిన్హ్ అనోప్‌సిన్హ్(43), జడేజా దైవత్‌సిన్హ్ కిరీట్‌సిన్హ్(34), సినోజియా కేథన్ సురేష్‌బాయ్(23)లను అరెస్ట్ చేశారు.
ముంబై పోలీసులమంటూ..
ముంబై పోలీసులమంటూ సికింద్రాబాద్‌కు చెందిన ఓ వైద్యురాలు(74)కు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. మీపై మనీలాండరింగ్ కేసు నమోదు అయ్యిందని, హైదరా బాద్ పోలీసులు అరెస్ట్ చేస్తారని భయభ్రాంతులకు గురిచేశారు. వీడియో కాల్‌లో మాట్లాడి.. నకిలీ అరెస్ట్ వారెంట్, సుప్రీం కోర్టు ఉత్తర్వు లు, సీబీఐ లేటర్ చూపించారు. ఈ కేసులో ప్రమేయం లేకుంటే విచారణ నిమిత్తం బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తాన్ని తాము సూచించిన ఖాతాకు బదిలీ చేయాలని, 24 గంటల్లో తిరిగి మీ ఖాతాకు బదిలీ చేస్తామని చెప్పారు.
నిజమేనని నమ్మిన వైద్యురాలు తన రెండు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1.60 కోట్లను బదిలీ చేసింది. అనంతరం వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గుజరాత్‌కు చెందిన సైబర్ నిందితులు సాగర్ గోరధన్‌బాయ్ ప్రజాపతి అలియాస్ సాగర్ ప్రజాపతి(27), పర్మర్ కిరీట్ నాథుబాయ్(33)లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దుబాయ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అతడిని ఎల్‌వోసీ జారీ చేశామని సీపీ కొత్తకోట శ్రీనివాసస్‌రెడ్డి వివరించారు.
ట్రేడింగ్ పేరుతో..
నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి(60)కి వాట్సప్‌లో ‘మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్’ ట్రేడింగ్ అంటూ మేసేజ్ వ చ్చింది. అనంతరం స్కామర్లు లింక్‌ను పంపారు. ట్రేడింగ్‌లో పెట్టుబడులపై ఆసక్తి ఉంటే లింక్ క్లిక్ చేయాలని కోరారు. బాధితుడు ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. మొదట్లో కొద్ది మొత్తంలో లాభాలు రావడంతో పలు దఫాలుగా మొత్తం రూ. 60.88 లక్షలు పెట్టుబడి పెట్టా డు.
అనంతరం స్కామర్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసు లో గుజరాత్‌కు చెందిన కణాని నికుంజ్ కిషోర్ బాయ్(33), ప్రవీణ్‌బాయ్ కలుబా య్ వసోయా(55)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా మొత్తం 20 కేసుల్లో నిందితులుగా ఉన్న 36 మందిని అరెస్ట్ చేశారు. సైబర్ నేరస్థులను పట్టుకోవడంలో కృషి చేసిన సైబర్ క్రైమ్ టీమ్ డీసీపీ ధార కవిత, ఏసీపీలు శివమారుతి, చాంద్‌పాషా, ఇన్‌స్పెక్టర్లు ప్రసాద్‌రావు, మధు సూధన్‌రావులను సీపీ అభినందించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరినీ వదిలిపెట్టం
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయమున్న ఎవరినీ వదిలిపెట్టబోమని హైదరా బాద్ సీపీ స్పష్టంచేశారు. శనివారం బషీర్‌బాగ్ సీసీఎస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడు తూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. ఈ కేసులో కీలక నిందితులు మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, అడిషనల్ ఎస్పీ లు భుజంగరావు, తిరుపతిరావును ఇప్పటికే అరెస్ట్ చేశామని తెలిపారు.
ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఓ మీడియా ఛానల్ అధినేత శ్రవణ్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను కోరామని, సీబీఐ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసిన తర్వాత వారిని దేశానికి తీసుకొస్తామని స్పష్టంచేశారు. మొదట్లో బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయాలనుకున్నాం కానీ బ్లూ కార్నర్ నోటీసుతో అమెరికా ప్రభుత్వం వ్యక్తులను మనకు అప్పగించే పరిస్థితులు కనబడట్లేదు. అందుకే రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసేందుకు చేశామని తెలిపారు. ఈ కేసుతో సంబంధమున్న వారందరినీ విచారిస్తామని స్పష్టం చేశారు.






