9 June, 2026 | 1:55 PM

విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్

09-06-2026 12:45 PM

విశాఖ: విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం  పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, ఘటన జరిగినప్పుడు షిఫ్ట్ లో ఎంతమంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకొని, మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ... స్టీల్ ప్లాంట్  ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరమని, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఆయన వెంట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీ యాదవ్ లు ఉన్నారు.