9 June, 2026 | 2:16 AM

కూటమిని మరింత బలోపేతం చేద్దాం

09-06-2026 01:10 AM
  1. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపు
  2. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: రాహుల్
  3. న్యూఢిల్లీలో ఇండియా కూటమి కీలక సమావేశం
  4. సర్ అక్రమాలపై సీజేఐకి లేఖ రాయాలని నిర్ణయం
  5. నిరుద్యోగం, ఆర్థిక ఒడిదుడుకులపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని డిమాండ్
  6. భేటీకి డీఎంకే, ఆప్ నేతలు డుమ్మా

న్యూఢిల్లీ, జూన్ ౮: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాం గ విధానాల వైఫల్యాలను ఎండగట్టేందుకు ఇండియా కూటమి సిద్ధం కావాలని, అందుకు మునుపటి కంటే కూటమిని మరింత బలోపేతం చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికా ర్జున ఖర్గే పిలుపునిచ్చారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో సోమవారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఇండియా కూటమి సమావేశం జరిగింది. లోక్‌సభ ఎన్నికల కంటే ముందు 2024 జూన్ 1న ఈ కూటమి చివరిసారిగా భేటీ అయింది.

ఎంతోకాలం తర్వాత కూటమి పూర్తిస్థాయిలో సమావేశం కావడం ఇదే మొదటి సారి. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగాలని విపక్ష నేతలకు సూచించారు. బీజేపీ ప్రభుత్వ దుష్పరిపాలన వల్ల దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని విమర్శించారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజనకు సం బంధించి కేంద్రం తెచ్చిన బిల్లులను కలిసికట్టుగా అడ్డుకున్నామని గుర్తుచేశారు.

అదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. దేశంలో రాజ్యాం గ సంస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, వాటిని కేంద్రం తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐని సాధనాలుగా వాడుకుంటున్నదని దుయ్యబట్టారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ఆయన తప్పుబ ట్టారు. ఈ సవరణల వల్ల లక్షలాది మంది పౌరులు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుత ఆర్థిక వాతావరణం ప్రతికూలంగా ఉందని అభిప్రాయపడ్డారు. 

సర్ అక్రమాలపై సీజేఐకి లేఖ రాస్తాం

ఓటర్ల జాబితాల సవరణ(సర్)లో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి లేఖ రాయాలని కూటమి నిర్ణయించింది. నీట్ పేపర్ లీక్, సీబీఎస్‌ఈ పరీక్షల వివాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేసింది. దేశ ఆర్థిక పరిస్థితులు, నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. 

ఇండియా కూటమి సమావేశంలో విపక్షాల మధ్య ఉన్న విభేదాలు భేటీలో భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పెద్దలు కూటమిని నడిపిస్తున్న తీరుపై అనేక ప్రాంతీయ పార్టీలు బాహాటంగానే విమర్శించాయి. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు సమన్వయంతో వ్యవహరించలేదని మండిపడ్డాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందిస్తూ.. ఇండియా కూటమి ఐక్యంగానే ఉందన్నారు.

ఎన్నికల ప్రచారంలో స్థానిక పరిస్థితుల ఆధారంగా రాష్ట్ర స్థాయి నేతలు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను తాను పరిగణనలోకి తీసుకుంటానని వివరణ ఇచ్చారు. రానున్న 2029 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పక్కా వ్యూహాన్ని అవలంబించాల్సి ఉందని నొక్కి చెప్పారు. ఈ సమావేశానికి 25 విపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షమైన డీఎంకే ఈ సమావేశానికి దూరంగా ఉండటం గమనార్హం. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికార పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే)తో పొత్తు పెట్టుకుంది. ఈ పరిణామంపై అసంతృప్తితో ఉన్న డీఎంకే కూటమి భేటీకి రాలేదు. కాగా, ఈ సమావేశానికి టీవీకేకు ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలిసింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండటం గమనార్హం.