ఏపీ లిక్కర్ స్కాం: రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్ట్
- ప్రధాన సూత్రదారులకు 14 రోజులు రిమాండ్
- నిందితులు, వారి బంధువులు, పలువురు అధికారులు, నేతల ఇండ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
- తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు
- కీలక డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు స్వాధీనం
శేరిలింగంపల్లి,జూన్ 11 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం (మద్యం కుంభకోణం) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. స్కామ్‌లో కీలక సూత్రదారి, ఏ1గా ఉన్న ఐటీ మాజీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.
దీంతో వారిని ఈడీ అధికారులు చంచల్‌గూడ్ జైలుకు తరలించారు. మద్యం కుంభకోణంలో నిందితులు ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించినట్లు దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో ఈడీ అధికారులు గురువారం ఉదయం వారిని అదుపులోకి తీసుకున్నారు.
కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి నివాస గృహాలు, కార్యాలయాలతో పాటు మద్యం రవాణాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పలువురు అధికారులు, నేతలు, వారి బంధువుల ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 8 లక్షల నగదు, రెండు రోలెక్స్ వాచీలు, లగ్జరీ వాహనాలతో పాటు కీలక డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది.
రూ.3,200 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు!
ఏపీ మద్యం కుంభకోణంలో రూ.3,200 కోట్ల మేర చేతులు మారాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణ జరిపి మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అభియోగం మోపింది. హవాలా మార్గంలో నిధుల బదిలీ జరిగిందని ఆధారాలు సేకరించి, ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేష్ రిపోర్టు (ఈసీఐఆర్) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
మద్యం కంపెనీలు, డిస్టిలరీల నుంచి లంచాలు వసూలు చేయడానికి రాజ్ కేసిరెడ్డి ఒక వ్యవస్థనే నడిపినట్లు దర్యాప్తులో తేలింది. అవినీతి సొమ్మును వివిధ డొల్ల కంపెనీల ద్వారా రూటింగ్ చేసి, హవాలా మార్గంలో అంతిమ లబ్ధిదారులకు చేర్చినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది.
ఈ నల్లధనాన్ని హైదరాబాద్, తెలంగాణలోని రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోను ’ఈడీ క్రియేషన్స్’ అనే సినిమా నిర్మాణ సంస్థలో పెట్టుబడిగా పెట్టినట్లు తేల్చారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో నానక్‌రామ్‌గూడలోని నివాసంలో రాజ్ కేసిరెడ్డిని, వాసుదేవరెడ్డిని ఆయన ఇంట్లో ఈడీ అరెస్టు చేసింది.
కంపెనీల గుట్టు తేలుస్తున్న ఈడీ
మద్యం కుంభకోణం కేసులో విజయవాడ సిట్ ఇప్పటికే నాలుగు చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ కేసులో పలువురు మాజీ ఎంపీలు, నేతలు, ఉన్నతాధికారులు మొత్తం 33 మందిని నిందితులుగా చేర్చారు. ఏ1 రాజ్ కేసిరెడ్డి ఇప్పటికే అరెస్టు అయ్యారు. బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మద్యం రవాణా టెండర్లలోనూ భారీగా డబ్బు చేతులు మారినట్టు తెలిసింది. ఈడీ సోదాల్లో శ్రీసుదర్శన్ ఫార్మాకు రూ.73 కోట్లు అందించినట్టు సమాచారం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడికి ముడుపులు అందినట్టు తెలిసింది.






