12 July, 2026 | 3:25 AM

‘ఓపెన్ ఏఐ’పై యాపిల్ దావా

12-07-2026 01:20 AM
  1. డాటా దొంగిలించిందని అభియోగాలు
  2. కాలిఫోర్నియా కోర్టులో పిటిషన్

న్యూయార్క్, జూలై 11: తమ వాణిజ్య సంస్థ రహస్యాలను ఓపెన్ ఏఐ దొంగిలించిందని యాపిల్ సంస్థ కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా దాఖలు చేసింది. ఓపెన్ ఏఐ సంస్థతో సహా యాపిల్‌లో పనిచేసిన ఇద్దరు మాజీ ఉద్యోగులపైన చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. డిజైన్, తయారీ ప్రక్రియ, సరఫరా గొలుసు వ్యూహాలకు సంబంధించి రహస్య సమాచారాన్ని వీరంతా కలిసి దొంగిలించినట్లు ఆరోపించింది. సంస్థ నుంచి వెళ్లేటప్పుడు మాజీ యాపిల్ ఇంజనీర్లు చాంగ్ లియు, టాంగ్ యెవ్ టాన్లు సంస్థ ల్యాప్‌ట్యాప్‌లను తిరిగి ఇవ్వలేదని పిటిషన్‌లో పేర్కొంది. అథెంటికేషన్ బగ్ సహాయంతో నెట్‌వర్క్ లోకి చొరబడి రహస్యాలను దొంగిలించారని పేర్కొన్నారు.

వీరిద్దరూ ఏఐకు ప్రయోజనం చేకూర్చేందుకు రహస్య సమాచారాన్ని పద్ధతి ప్రకారం ఉపయోగించుకున్నారని దావాలో యాపిల్ ఆరోపించింది. ఓపెన్ ఏఐలో జరిగే ఇంటర్వ్యూల్లో ‘షో అండ్ టెల్’ సెషన్ల కోసం అప్పటి యాపిల్ ఉద్యోగులను విడిభాగాలను తీసుకురావాలని టాంగ్ ప్రోత్సహించినట్లు పేర్కొంది. ప్రస్తుతం 400 మంది మాజీ ఉద్యోగులు ఓపెన్ ఏఐలో పనిచేస్తున్నారని వెల్లడించింది. తమ వద్ద హార్డ్‌వేర్ రంగంలోని వాణిజ్య రహస్యాలకు సంబంధించిన విభాగాల్లో పనిచేసిన ఉద్యోగులకు ఇప్పుడు ఆ వివరాలను ఓపెన్ ఏఐలో ఉపయోగించుకోవడానికి హక్కు ఉండదని పేర్కొంది.

ఓపెన్ ఏఐ హార్డ్‌వేర్ రంగంలోనూ వడివడిగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే హార్డ్‌వేర్ స్టార్టప్ ఐఓ ప్రొడక్ట్‌ను సొంతం చేసుకునేందుకు 6.5 బిలియన్ డాలర్లను కూడా వెచ్చించింది. యాపిల్ ఏఐ రెండు సంస్థల మధ్య పోటీతో సంబంధాలు దెబ్బతిన్నాయి. గోప్య సమాచారం ఏఐకి చేరుతుందనే ఆందోళన నేపథ్యంలో చర్చిద్దామని అడిగామని, కానీ ఓపెన్ ఏఐ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని యాపిల్ తన ఫిర్యాదులో ఆరోపించింది.