ఇన్‌చార్జి వీసీలుగా ఐఏఎస్‌ల నియామకం సరికాదు:ఎస్‌ఎఫ్‌ఐ
హైదరాబాద్ సిటీబ్యూరో, మే21(విజయక్రాంతి) : యూనివర్సిటీలకు ఐఏఎస్‌లను ఇన్‌చార్జి వీసీలుగా నియమించడం పట్ల వివిధ విద్యార్థి సంఘాలు వేర్వేరు ప్రకటనల్లో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఐఏఎస్‌లను ఇన్‌చార్జి వీసీలుగా నియమించడం సరికాదని, వెంటనే రెగ్యులర్ వీసీలను నియమించాలని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.ఎల్ మూర్తి, టీ నాగరాజు డిమాండ్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ అనుభవం కలిగిన, రాజకీయాలకు జోక్యం లేకుండా వీసీలను నియమించాలని కోరారు.
స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి: పీడీఎస్‌యూ
ఐదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మామిడికాయల పరశురాం మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. సుమారు రూ.7,500కోట్లు బకాయిలు ఉన్నాయని, ఫలితంగా చదువు పూర్తయినా కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించే సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఫీజురీయింబర్స్ మెంట్‌పై మాట్లాడడం లేదని విమర్శించారు.
రెగ్యులర్ వీసీలను నియమించాలి: పీడీఎస్‌యూ
యూనివర్సిటీలకు ఇన్‌చార్జి వీసీలుగా ఐఏఎస్‌లను నియమించడం హాస్యాస్పదమని, తక్షణమే రెగ్యులర్ వీసీలను నియమించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం.శ్యామ్ డిమాండ్ చేశారు. ఇన్‌చార్జి వీసీలతో పాలన కుంటుపడుతుందని మంగళవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
గత వీసీలపై దర్యాప్తు చేయాలి: ఏఐఎస్‌ఎఫ్
తాజా మాజీ వీసీలపై అనేక అవినీతి ఆరోపణలున్నాయని, వారిలో పలువురు రెండుసార్లు వీసీలుగా బాధ్యతలు నిర్వహించారని ఏఐఎస్‌ఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి గ్యార నరేష్ ఆరోపించారు. మూడేళ్లుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పడకుండా గత ప్రభుత్వం మెప్పు కోసమే పని చేశారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాలరాసిన వీసీలపై ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. పైరవీలకు తావులేకుండా యూనివర్సిటీలపై పట్టున్న వారిని వీసీలుగా నియమించాలని డిమాండ్ చేశారు.






