‘ఎంఎస్‌ఎంఈ’ బిల్లుకు ఆమోదం
- ఎలాంటి చర్చ లేకుండానే లోక్‌సభలో బిల్లు ఆమోదం
- మూజువాణి ఓటింగ్ ద్వారా బిల్లు క్లియర్
- విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా ఉభయ సభల్లోనూ విపక్షాల ఆందోళన
- రెండు సభలకూ బ్రేక్.. 10వ తేదీకి వాయిదా
న్యూఢిల్లీ, ఆగస్టు ౭: విపక్షాల ఆందోళనలు, నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే లోక్‌సభలో శుక్రవారం సూక్ష్మ, చిన్న, మధ్య (ఎంఎస్‌ఎంఈ) తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు 2026 ఆమోదం పొందింది. మూజువాణి ఓటింగ్ ద్వారా బిల్లు సభ ఆమోదాన్ని సాధించింది. ఉదయం కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి జితన్‌రాం మాంఝీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చెల్లింపుల ఆలస్యం సమస్యను పరిష్కరించడం బిల్లు ప్రధాన ఉద్దేశం.
ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందగా, తాజాగా లోక్‌సభలోనూ ఆమోదం పొందింది. జంతర్‌మంతర్ మద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిపై కేంద్ర హోమంత్రి అమిత్‌షా సమాధానం ఇవ్వాలని పట్టుబట్టాయి. అయోధ్య రామమందిర ట్రస్ట్ విరాళాల దుర్వినియోగంపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశాయి. విపక్ష ఎంపీ మాణికం ఠాగూర్ ఈ అంశంపై వాయిదా తీర్మానమిచ్చారు. లాఠీచార్జిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
దీంతో కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు స్పందించారు. ఏ మంత్రి ఏ సమయంలో సభకు రావాలో ప్రతిపక్షాలు ఎలా నిర్దేశిస్తాయని ప్రశ్నించారు. మరోవైపు, రాజ్యసభలోనూ విపక్షాలు విద్యార్థులపై లాఠీచార్జి, అయోధ్య రామమందిర విరాళాలపై పై చర్చ జరగాలని పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాల సమయంలో గందరగోళం నెలకొంది. దీంతో ఉభయసభలూ సోమవారానికి వాయిదా పడ్డాయి. అనంతరం బయటకు వచ్చిన విపక్ష ఎంపీలు వర్షం కురుస్తున్నప్పటికీ, పార్లమెంట్ వెలుపల ఉన్న మకర ద్వార్ వద్ద గొడుగులు పట్టుకుని ధర్నా నిర్వహించారు. కేంద్ర మంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా నినదించారు.






