అభిశంసన తీర్మానానికి ఆమోదం
దక్షిణ కొరియా అధ్యక్షుడి అధికారాల్లో కోత?
సియోల్, డిసెంబర్ 14: దక్షిణకొరియా నేషనల్ అసెంబ్లీలో ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై ప్రవేశపెట్టిన తీర్మానంపై మరోసారి ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో అధ్యక్షుడికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 204 ఓట్ల తేడాతో జాతీయ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. తాజా పరిణామాలతో ఆయ న అధికారాలకు కోతపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియా నేషనల్ అసెంబ్లీలో 300 మంది సభ్యులున్నారు.
యూన్ సుక్ యోల్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓట్లేయగా, వ్యతిరేకంగా 85 ఓట్లు పడ్డాయి. దీంతో తీర్మానం ఆమోదం పొందిం ది. ఈ తీర్మానానికి సంబంధించిన పత్రాలను రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానానికి పంపుతారు. తీర్మానాన్ని పరిశీలించేందుకు కోర్టుకు 180 రోజుల సమయం ఉంటుంది.
గడువులోగా అధ్యక్షుడిగా యూన్ సుక్‌ను కొనసాగిం చాలా? లేదా తొలగించాలా? అన్న అంశంపై న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేశ అతడిని పదవి నుంచి తొలగిస్తే.. 60 రోజుల్లో అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. అప్పటివరకు ప్రధానమంత్రే అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తాజాగా ఎమర్జెన్సీ మార్షల్ లా విధించారు.
ఆయన నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో యూన్ సుక్ తన ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. అయినా ఆయన చర్యను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. అధ్యక్షుడు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల మార్షల్ లా ప్రకటనను వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనం తరం మార్షల్ లా అమలు చట్టవిరుద్ధమంటూ స్పీకర్ ప్రకటించారు.
అధ్యక్షుడిపై విపక్ష నేత అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అధికార పీపుల్ పవర్ పార్టీ (పీపీపీ) బాయ్‌కాట్ చేయడంతో ఆయనకు పదవీగండం తప్పిందని ఊపిరి పీల్చుకునే లోపే మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజా ఓటింగ్‌లో తీర్మానాన్ని సభ ఆమోదించింది. దీంతో యూన్ సుక్ మరోసారి చిక్కుల్లో పడ్డారు.






