రైతుల పాదయాత్ర నిలిపివేత
ఢిల్లీ చలో కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు కర్షకులపై
టియర్ గ్యాస్ ప్రయోగం 17 మంది అన్నదాతలకు గాయాలు
శంభు వద్ద తీవ్ర ఉద్రిక్తత
శంభు/ఢిల్లీ, డిసెంబర్ 14: తమ డిమాండ్ల పరిష్కారం కోసం రైతులు చేపట్టిన ఢిల్లీ చలో పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు రైతు సంఘా ల నాయకులు ప్రకటించారు. వివిధ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ 101 మంది రైతు లు శనివారం మధ్యాహ్నం హర్యానా, పంజాబ్ సరిహద్దు ప్రాంతం శంభు వద్ద పాదయాత్రను ప్రారంభించారు. అయితే రైతులు ముందుకు వెళ్లకుండా హర్యానా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అన్నదాతలను చెదరగొట్టేందుకు వారిపై హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ క్యానన్లను ప్రయోగించా రు. లాఠీచార్జి చేయడంతో 17 మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. శంభు వద్ద పరిస్థితి మరోసారి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఢిల్లీకి తమ పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు రైతు నాయకులు ప్రకటించారు.
అంతర్గత సమావేశం తరువాత తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని రైతు నాయకుడు తేజ్వీర్ సింగ్ తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధమైన హామీతోపాటు 11 డిమాండ్ల పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఢిల్లీ ముట్టడికి మూడోసారి రైతులు ప్రయత్నించారు. అయితే శంభు వద్ద రైతులను పోలీసులు అడ్డుకున్నారు. కాగా రైతుల ఢిల్లీ చలో మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడం ఇది మూడోసారి.
డిసెంబర్ 6 నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా ఇప్పటికే రెండుసార్లు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. ఒకవైపు రైతులను ఆపడం లేదని ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు వారిపై టియర్ గ్యాస్‌ను ప్రయోగిస్తూ పాకిస్థాన్ సరిహద్దుగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత బజరంగ్ పూనియా ధ్వజమెత్తారు. అయితే ఢిల్లీకి పాదయాత్రగా వెళ్లడానికి రైతులకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
ఇంటర్‌నెట్ నిలిపివేత..
రైతుల పాదయాత్రతో హర్యానా ప్రభు త్వం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యగా ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేసింది. 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ అర్ధరాత్రి వరకు ఇంటర్‌నెట్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
రైతుల డిమాండ్లు..
పంటలకు ఇచ్చే కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. రుణమాఫీ చేయాలని, రైతులు, రైతు కూలీలకు పెన్షన్, విద్యుత్ చార్జీల తగ్గింపు, రైతులపై నమోదైన కేసులను ఎత్తేయడం, లఖీంపూర్ రైతు బాధితులకు న్యాయం చేయడం, భూసేకరణ చట్టం పునరుద్ధరించడం, ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
18న రైల్ రోకో..
రైతులపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రైతు నేత సర్వాన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడ్డ రైతులకు సరైన చికిత్స కూడా అందడం లేదన్నారు. ఈ సందర్భంగా తమ భవిష్యత్ కార్యాచరణను ఆయన ప్రకటించారు. ఈ నెల 16న పంజాబ్ బయట ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 18న రైల్ రోకోకు ఆయన పిలుపునిచ్చారు. రైల్‌రోకోలో పంజాబీ రైతులంతా పాల్గొనాలని ఆయన కోరారు.






