8 May, 2026 | 9:21 AM

రైతు రుణమాఫీలు సాధ్యమేనా?

19-05-2024 12:00 AM

కన్నోజు శ్రీహర్ష :

నాణ్యమైన విత్తనాలు, ఉచిత ఎరువులపై కూడా ప్రభుత్వాలు ఆలోచన చేస్తే రైతులు ఎవరూ రుణాలు తీసుకోరు. పండిన పంటకు గిట్టుబాటు ధరకు చట్టరూపం ఇవ్వడం, బీమా సౌకర్యం కల్పిం చడం వల్ల రైతులు రుణాలు తీసుకోవడం మానేస్తారు. బ్యాంకులు సైతం రైతులను పెట్టుబడి పెట్ట్టే విధంగా ఆహార తయారీ రంగాల్లో రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వ విధానాలు తీసుకురావాలి. 

తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీపై రాజకీయాలు తీవ్రస్థా యికి చేరుకున్నాయి. అసలు రైతు రుణమాఫీలు ఈ రోజుల్లో సాధ్యం అవుతా యా? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేస్తుంది? అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. నేడు దేశంలో తీవ్ర మైన ఆర్థిక ఒత్తిడి నెలకొని వుంది. కేంద్ర ప్రభుత్వం నేడు కనీసం పన్నులను సైతం సక్రమంగా రాష్ట్రాలకు బదిలీ చేయడం లేదు. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభు త్వం ఎలాంటి విధివిధానాలు లేకుండా రుణమాఫీకి ఆర్‌బీఐని ఎలా ఒప్పిస్తుందో, ఎలా పంట రుణమాఫీ చేస్తారో చెప్పడం లేదు. దీనివల్ల మళ్ళీ కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. 

అసలు రైతు రుణమాఫీలు ఎలా చేస్తా రు? తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 73 లక్షల పైన రైతులు రుణాలు తీసుకొని ఉన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు రుణమాఫీ చేయాలన్నా దాదాపు 1.12 లక్ష కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది.  వీరందరికి ఏక కాలంలో మాఫీ చేస్తారా? లేదా కేవలం ప్రభుత్వ బ్యాంకుల ద్వారా పొంది న రుణాన్ని మాత్రమే మాఫీ చేస్తారా? అనేది ఇప్పటి వరకు ఒక విధానాన్ని స్పష్టం చెయ్యలేదు. దేశ వ్యాప్తంగాకూడా రుణమాఫీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో సాధ్యమేనా? ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీఓ) ఎలాంటి షరతులు కేంద్ర ప్రభుత్వానికి విధించింది? ఆర్‌బీఐ రుణమాఫీలకు అనుమతిస్తుందా? 

మధ్యవర్తుల చేతిలో బందీ

1970వ దశకంలో వ్యవసాయ రంగం ముందుకు సాగడానికి, విప్లవాలను  సృష్టించడానికి ఆనాడు రైతులపై భారీగా ఒత్తిడిలు ఉండేవి. పంటల మార్పిడి చేసి జొన్నలు, రాగులు పండించే స్థానంలో వరి వేయడం ఆనవాయితీగా మారింది. ఇక్కడి నుండే రైతులు వీటికి కావాల్సిన పెట్టుబడిపై దృష్ట్టి సారించారు. మెల్లగా  బ్యాంకుల ద్వారా రుణాలను తీసుకోవడం మొదలుపెట్టారు. 1982లో నాబార్డ్ సంస్థ ఏర్పాటైంది. ఇక్కడ వచ్చిన సమస్య ఏం టంటే రైతులుకు, -బ్యాంకు వ్యవస్థ మధ్య సమన్వయ లోపం ఉండడమే. అసలు ఏం పండించాలి? పండించిన దానికి ప్రభుత్వ గిట్టుబాటు రేటు ఎలా ఉంటుంది? బీమా సౌకర్యాన్ని కల్పిస్తారా? అనే అనేక ప్రశ్నలు రైతుల్లో ఆలోచనలను రేకెత్తించాయి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం  ఒక సరైన విధానాన్ని తీసుకు రాకపోవడం వల్లనే రైతులు నష్టపోయారు. మధ్యవర్తుల ప్రమే యం మెల్లగా గ్రామీణ వ్యవసాయ రంగంపై పడింది. గ్రామంలో చిన్న, సన్నకారు రైతులను లోబర్చుకొని నేరుగా రుణాలను రైతులకు అందించేవారు. 

ఈ విధంగా రైతాంగం పూర్తిగా మధ్యవర్తుల చేతిలో బలైపోయింది. ప్రభుత్వ బ్యాంకుల కంటే ఎక్కువ రుణాలు రైతులు వీరి దగ్గర నుండే తీసుకోవడం వల్ల వ్యవసాయ వక్రీకరణ జరిగింది. దీని అదును గా చేసుకొని కాంగ్రెస్, ఇతర పార్టీలు రాజకీయ లబ్దికోసం రుణమాఫీలు చేస్తామని ముందుకు రావడం జరిగింది. ఇది ఒక వ్యసనంగా మారి కొద్దిమంది రైతులకు మాత్రమే రుణాలు మాఫీ చేయడం జరిగింది. విపరీతమైన నియమాలను పెట్టి రుణమాఫీలు చేయక పోవడం వల్ల రైతుల ఆత్మహత్యలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే రైతు ఆత్మహత్యలు తీవ్రతరమైనాయన్న విమర్శలు వున్నాయి. పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడే విధంగా ఆనాడు కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీల విషయంలో వ్యవహరించేది.  

ఆర్‌బీఐ కీలక ప్రకటన

2015-- నాటికి అప్పటి ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ రుణమాఫీలపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో, దేశంలో ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచే విధంగా చర్యలు ఉండాలని నియమాలు పెట్టింది. 14వ ఆర్థిక కమిషన్ సైతం ఆర్థిక పరిస్థ్దితిపై ఆరా తీసింది. 2015 లో ఆర్‌బీఐ ఇక నుండి దేశంలో, అన్ని రాష్ట్రాల్లో రుణమాఫీలు అమలు చేయటం సాధ్యం కాదని, ఇది ఒక ఎన్నికల స్టంట్‌గా అన్ని పార్టీలకు మారిందని వివరించింది. దీనితో రుణమాఫీలపై చాలా పార్టీలు సైతం ఎన్నికల్లో హామీలు ఇచ్చి చేయలేకపోయాయి. నూతనంగా ఏర్పాటైన ఆంధ్రరాష్ట్రంలో సైతం చంద్రబాబు నాయుడు రుణమాఫీలు చేయలేకపోయారు. ఇదే సమయంలో నోట్ల రద్దు, జీఎస్టీ అమలులోకి వచ్చాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో సైతం కేసీఆర్ సర్కార్ అంచెలవారీగా రైతు రుణమాఫీ చేస్తూ వచ్చింది. 

ప్రపంచ వాణిజ్య సంస్థలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉండడం వల్ల దేశ జీడీపీలో 10% కంటే ఎక్కువ వెసులుబాట్లు రైతులకు ఇవ్వడానికి మనకు  వీలు ఉండదు. ఆ సంస్థలో వ్యవసాయ ఒప్పందంలో  భాగంగా 3 బాక్సులు ఉంటాయి. (ఆకుపచ్చ, నీలం , కాషాయం).  ఎక్కువ ప్రభావం ఉండే విధానాలు కాషాయ బాక్సులోకి వస్తాయి. రైతు రుణమాఫీలు ఆ కాషాయం కోవకి రావడంతో,  ప్రపంచవ్యాప్తంగా వాటి ప్రభావం ఉండడం వల్ల రైతు రుణమాఫీలపై ప్రపంచ వాణిజ్య సంస్థ సైతం మన దేశంపై షరతులు విధించింది. అన్ని విషయాలనూ దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సంఘం  వీటిని ప్రోత్సహించడం లేదు. నీతి ఆయోగ్ రైతులకు రుణమాఫీలకు బదులు రైతులకు పెట్టుబడి పెట్ట్టే విధానాలను తీసుకు రావాలని సూచించింది.

ప్రభుత్వ విధానాలు మారాలి 

మన దేశంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఆదాయం సమకూర్చే విధమైన ఆలోచనలతో ముందుకు రావాలి. కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధు పథకం ఈ కోవకి చెందిందే. 24 గంటల ఉచిత విద్యుత్తు , నిరంతర నీటి సరఫరా, రైతు వేదికల నిర్మాణం వంటివి ప్రభుత్వమే పెట్టుబడి పెట్టే విధంగా విధానాలు తీసుకురావడం వంటివి రైతులకు మేలు చేసే వే. నాణ్యమైన విత్తనాలు, ఉచిత ఎరువులపై కూడా ప్రభుత్వాలు ఆలోచన చేస్తే రైతులు ఎవరూ రుణాలు తీసుకోరు. పండిన పంటకు గిట్టుబాటు ధరకు చట్టరూపం ఇవ్వడం, బీమా సౌకర్యం కల్పిం చడం వల్ల రైతులు రుణాలు తీసుకోవడం మానేస్తారు.

బ్యాంకులు సైతం రైతులను పెట్టుబడి పెట్ట్టే విధంగా ఆహార తయారీ రంగాల్లో (ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్) రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వ విధానా లు తీసుకురావాలి. 2004లో ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సుల ను అమలు చేయాల్సిన అవసరం ఉంది. మరిన్ని కొత్త ఆలోచనలతో ప్రభుత్వాలు ఆలోచిస్తే ఈ రుణమాఫీలు అనేవి ఉండ వు. రైతులు సైతం ఆదాయం సమకూర్చుకునే విధానాలపై దృష్టి పెడతారు. కేంద్రీ కృతమైన విధానాల వల్ల, 15వ ఆర్థిక సంఘం షరతుల వల్ల  ప్రస్తుత పరిస్థితు ల్లో రైతు రుణమాఫీలు చాలా క్లిష్టమైన పని. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం  ఇచ్చిన 6 గ్యారెంటీలలో రైతులకు నిజంగా ప్రయోజనమయ్యే పనులను చేస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు.

వ్యాసకర్త సెల్: 8985130032