అజ్ఞాత బంధనాలు
భయపడుతున్నాను
అవును నేను నిజంగానే
భయపడుతున్నాను
చుట్టూ తెలియని అజ్ఞాత
సంకెళ్లున్నాయని
వెన్నెల మాటులోనే నల్లని మేఘాలు
పొంచి చూస్తున్నాయని
తెలిసినప్పుడు భయం కాక మరేమిటి?
కులాహంకార పడగలే
రాజకీయాలకు
రక్షా కవచం అవుతుంటే
అతి నాగరికతా వ్యవస్థల్లో కూడా
కులం అమూర్తమైన పెద్దపులి రూపం
ధరించి చూస్తుంటే
ఇంకా భయపడకుండా ఎలా ఉండను?
సమస్త రాజకీయ చైతన్యాన్ని
ధనమే శాసిస్తుంటే
మద్యం మత్తు ‘విచక్షణను’
అతి దారుణంగా కబళిస్తుంటే
భయం కాక మరేమిటి?
నేను అనుకున్నాను
నేను అవనతుణ్ణి కాదని
సత్యం అవనతం కాదని
కానీ కమ్ముకున్న
కాలం కోరలకు కావలసింది
దుఃఖపు ఆహారమని
మతం రాజకీయమై
రేపటి నిన్ను నిరూపం చేస్తుంటే
హుంకరిస్తున్న పర్వతాగ్నిలో
ఆకుపచ్చని చెట్లు శిథిలం అయిపోతుంటే
భయమే జీవితమైన క్షణాన
అభయం ఎక్కడుంది?
స్పృహ లేని బతుకుతున్న శవాలు
నిజంగా జీవించడం నేర్చుకోనంత కాలం
పచ్చ పొలాల అడుగుల్లో
పాములు కదులుతూనే ఉంటాయ్
అన్ని రంగాలను శాసిస్తున్న
కుల కాపట్యపు కృత్రిమ సహనం
నటనల క్షమ ప్రదర్శిస్తూనే ఉంటుంది.
కాంచనపల్లి గోవర్ధన్ రాజు
సెల్: 9676096614






