కరీంనగర్ కాక!
బీజేపీ x బీఆర్‌ఎస్
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో ఉద్రిక్తత
- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడి..
- కారు, ఆఫీసు ఫర్నీచర్ ధ్వంసం
- బీజేపీ ఆఫీసుపై బీఆర్‌ఎస్‌వీ దాడికి యత్నం
- హుజూరాబాద్‌లోనూ ఉద్రిక్తత
మా సహనం చేతగానితనం కాదు
అప్పుడు దాడులు చేసి ఇప్పుడు సుద్దపూస మాటలా?
కేంద్ర మంత్రి బండి సంజయ్
ఈ దాడి హేయమైన చర్య
సీఎం రేవంత్‌కు బీ- టీంగా బండి సంజయ్..కుప్పిగంతులు ఇవి.
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
కరీంనగర్, మే 7 (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన పార్టీల నేతల మధ్య విమర్శనాస్త్రాలు పరస్పరం దాడులకు పరిణమించాయి. ఒక రిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం తో పరిస్థితి విషమించింది. ప్రధాన పార్టీల నేతల మాటల తూటాలు ఉద్రిక్తతకు దారితీసాయి. హుజురాబాద్ ఎమ్మె ల్యే పాడి కౌశిక్ రెడ్డి గురువారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని, ఆయన పరీక్షలకు సిద్ధమా అని కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై పాడి కౌశిక్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ.. బండి సంజయ్ కూడా తంబాకులో డ్రగ్స్ తీసుకుంటున్నారని అనడంతో బీజేపీ శ్రేణు లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ వ్యాఖ్యలతో కోపోద్రిక్తులైన బీజేపీ కార్యకర్తలు క్యాంపు కార్యాలయంపై దాడికి దిగడం వెంటవెంటనే జరిగాయి. బీజేపీ శ్రేణులు కార్యాలయ ఆవరణలో ఉన్న కౌశిక్ రెడ్డి కారు, ఇతర వాహనాల అద్దాలతోపాటు ఫర్నీచర్‌ను కూడా ధ్వంసం చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ డ్రగ్ టెస్ట్‌కు రావాలని కౌశిక్ రెడ్డి సవాల్ విసరడం, అలాగే ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఈ గొడవ మొదలయింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను సోషల్ మీడియా లో చూసిన బీజేపీ కార్యకర్తలు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది. కౌశిక్ రెడ్డి విలేకరుల సమావేశం ముగిసీముగియగానే ఒక్కసారిగా బీజేపీ శ్రేణులు గంగుల క్యాంప్ కార్యాలయంపై విరుచుకుపడ్డాయి.
వాహనాల ధ్వంసం, క్యాంప్ ఆఫీసులోని పూల కుండీలు, కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అయితే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్‌ఎస్వీ కార్యకర్తలు కేంద్ర మంత్రి బండి సంజయ్ క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో బీజేపీ, బీఆర్‌ఎస్పీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో బీఆర్‌ఎస్‌కు చెందిన బుర్ర సంపత్‌గౌడ్, యూసుఫ్‌లు గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు పెద్దఎత్తున మోహరించి కార్యకర్తలను చెదరగొట్టి బీజేపీకి చెందిన స్థానిక కార్పొరేటర్, పార్టీ పార్లమెంటరీ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్, మైనార్టీ మోర్చా నాయకుడు ముజీబ్ తోపాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మేల్యే క్యాంప్ కార్యాలయం నుంచి కౌశిక్ రెడ్డి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయనను హుజురాబాద్‌కు తరలించారు.
కరీంనగర్ బంద్‌కు పిలుపు..
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికార క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు చేసిన దాడిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు తీవ్రంగా ఖం డించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ ప్రత్యర్థులపై ఇలాంటి దాడులు చేయ డం అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఈ సంఘటన ద్వారా పట్టణంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని స్పష్టమవుతుందని తెలిపారు. శాంతి భద్రతలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ దాడికి నిరసనగా శుక్రవారం కరీంనగర్ పట్టణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు జీవీ తెలిపారు. బంద్ కు నగరవాసులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు సహకరించాలని కోరారు.
పక్కా ప్లాన్‌తోనే హత్యాయత్నం: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
దాడి అనంతరం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, బండి సంజయ్, రేవంత్‌రెడ్డి కుమ్మక్కై పక్కా ప్లాన్‌తోనే తనపై హత్యాయత్నం చేయించారని విమర్శించారు. ‘బం డి సంజయ్ చేసిన వ్యాఖ్యలకే నేను సమాధానం ఇచ్చాను. ‘కరీంనగర్‌లో శాంతిభద్ర తలు క్షీణించాయని నేను ముందే చెప్పాను. నాపై రెక్కీ నిర్వహిస్తున్నారని, నన్ను చంపే అవకాశం ఉందని అధికారులను హెచ్చరించాను’ అని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ నాయకులు కర్రలు, కత్తులు, పెట్రో బాంబులతో తనపై దాడికి పాల్పడ్డారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌కు గన్ కల్చర్ తీసుకురావడం సరైన పద్ధతి కాదని, దొంగలను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించినందుకే నాపై దాడి చేశారని మండిపడ్డారు. కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పడమే నేను చేసిన తప్పా అని ఆయన ప్రశ్నించారు. తాను రెచ్చగొట్టానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు.
ఈ ఘటనతో రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ ఒక్కటేనన్న నిజం బయటపడిందని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని, ఓ అమ్మకు అబ్బకు పుట్టినవారైతే చర్చలకు రావాలని బండి సంజయ్ మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు. తనపై దాడి చేసిన వారంతా రౌడీ షీటర్లేనని తెలిపారు. దాడిపై మర్డర్ కేసు నమోదు చేయాలన్నారు.
హుజరాబాద్‌లోనూ ఉద్రిక్తత
బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకుల ఘర్ష ణ హుజరాబాద్‌లోనూ కొనసాగడం తో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అను చిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ కార్యకర్తలు జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు బీజేపీ నాయకులపై కర్రలతో దాడిచేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారిని వారించే ప్రయత్నం చేశారు.
అయితే పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు దాడులు కొనసాగించడంతో అసహనం చెందిన పోలీ సులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాల నాయకులను తరిమికొట్టారు. హుజురాబాద్ క్యాంప్ కార్యాలయాన్ని పోలీస్ వలయంలోకి తీసుకున్నారు అదనపు బల గాలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు.






