గాజు సీసాలే ప్రమాదమా?
మన ఇళ్లలో నిత్యం ఉపయోగించే గాజు సీసాలు ఆరోగ్యానికి, పర్యావరణానికి సురక్షితమని భావిస్తుంటాం. నీరు, పానీయాలు నిల్వ చేయడానికి ప్లాస్టిక్ కంటే గాజు సీసాలనే ఎక్కువమంది ఎంచుకుంటారు. కానీ తాజాగా ఫ్రెంచ్ ఆహార భద్రతా సంస్థ (ఏఎన్‌ఎస్‌ఈఎస్) నిర్వహించిన ఓ కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అవును.. మీరు విన్నది నిజం. గాజు సీసాలు ప్లాస్టిక్ కంటే ఎక్కువ మైక్రోప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తున్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఈ షాకింగ్ నిజాలు పరిశోధకులనే ఆశ్చర్యపరిచాయి.
పర్యావరణానికి మంచివిగా, ఆరోగ్యానికి శ్రేయస్కరంగా భావించి మనం గాజు సీసాలను వాడాం. వంటగదిలోనూ, ప్రయాణాల్లోనూ వాటిని తీసుకెళ్లాం. కానీ ఏఎస్‌ఎస్‌ఈఎస్ వెల్లడించిన ఈ కొత్త పరిశోధన ఫలితాలు మనల్ని ఆలోచింపచేస్తున్నాయి. ఈ అధ్యయనం ప్రకారం.. మనం ఇష్టమైన గాజు సీసాలు ప్లాస్టిక్ కంటే ఎక్కువ మైక్రోప్లాస్టిక్ కణాలతో కలుషితమవుతున్నాయట.
అధ్యయనంలో..
పరిశోధకులు తమ ప్రారంభ ఫలితాలను చూసినప్పుడు వారే నమ్మలేకపోయారు. గాజు సీసాలు ప్లాస్టిక్ కంటే శుభ్రంగా ఉంటాయని వారు ఊహించారు. కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. శీతల పానీయాలు, నిమ్మరసం, ఐస్ టీ, బీర్ వంటి పానీయాలు నిల్వ చేసిన గాజు సీసాలలో లీటరుకు సగటున 100 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.
ఈ సంఖ్య ప్లాస్టిక్ లేదా మెటల్ కంటైనర్లలో కనిపించే కణాల కంటే ఏకంగా 50 రెట్లు ఎక్కువ. ఈ కలుషితానికి ప్రధాన కారణం సీసాల మూతలే కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సీసాలలో లభించే చాలా ప్లాస్టిక్ కణాల రంగు, ఆకృతి మూత వెలుపల ఉండే పెయింట్‌తో సరిపోలాయి. దీన్ని బట్టి గాజు సీసాలకు ఉండే మెటల్ మూతల వెలుపలి పెయింట్ నుంచే ఈ చిన్న ప్లాస్టిక్ కణాలు పానీయాల్లోకి చేరిపోతున్నాయని అర్ధమవుతుందని పరిశోధకులు వెల్లడించారు.






