మన భవనాలు భద్రమేనా!
హైదరాబాద్ నగర శివారులో జోరుగా 30 నుంచి 60 అంతస్థుల నిర్మాణం
- ఎత్తున అపార్ట్‌మెంట్లకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు
- కువైట్ తరహా ప్రమాదాలు జరిగితే అదుపు చేసే వ్యవస్థ, సమర్థవంతమైన సాంకేతిక నైపుణ్యత ఇక్కడ ఉందా ?
- ఫ్లాట్ కొనాలనుకునే వారిలో ఎన్నో అనుమానాలు
హైదరాబాద్, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 15 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థకు 35 అంతస్థుల భవనం ఉంది. దీనిలో ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ అధినేతకూ ఓ ప్లాట్ ఉంది. ఒకరోజు అతడి తల్లి టీవీ చూస్తుండగా, ఆ ఫ్లాట్‌లో షాట్‌సర్క్యూట్ సంభవించి టీవీ పేలింది. ఆ సమయంలో స్వల్పంగా మంటలు కూడా చెలరేగాయి. అదృష్టవశాత్తు ఆ ఇంట్లో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఆ మంటలు ఒకవేళ ఇల్లంతా అంటుకుంటే ప్రమాద తీవ్రత వేరేలా ఉండేది.
అలాగే ఇటీవల కువైట్‌లో ఓ ఎత్తున భవనంలో అగ్నిప్రమాదం సంభించింది. ఘటనలో 45 మంది భారతీయులు సజీవ సమాధి అయ్యారు. ఆ భవనాన్ని యాజమాన్యం అక్కడి ప్రభుత్వ అనుమతులతోనే నిర్మించింది. ఎత్తున భవనం కావడం, రెస్క్యూ సిబ్బంది మంటలను ఆర్పేందుకు చాలా సమయం పట్టడంతోనే ప్రాణనష్టం అంతగా సంభవించింది. హైదరాబాద్ నగరంతో పోలిస్తే వాస్తవానికి కువైట్ అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతం.
అక్కడ అడ్వాన్స్‌డ్ ఫైర్ రెస్క్యూ సాంకేతికత ఉంటుంది. అగ్నిప్రమాదం సంభవిస్తే నిమిషాల్లోనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంటారు. అక్కడ అగ్నిప్రమాదం సంభవిస్తేనే, అంత ప్రాణనష్టం జరిగిందంటే, ఇక హైదరాబాద్ నగరంలో జరిగితే నష్టతీవ్రత ఎలా ఉంటుందో ఊహించవచ్చు. నష్టం కువైట్ కంటే సుమారు మూడు రెట్లు ఉంటుందని భవన నిర్మాణ రంగానికి చెందిన నిపుణుల అంచనా.
భారీగా ఆకాశ హర్మ్యాల నిర్మాణం..
విదేశాల్లో నిర్మించినట్లుగానే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోనూ బిల్డర్లు ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తున్నారు. వేగంగా అభివృద్ది చెందుతున్న నగర శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం 35 నుంచి 60 అంతస్థుల భవనలు అందుబాటులోకి వస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కూడా ఎత్తున కట్టడాలకు విరివిగా అనుమతులను జారీ చేస్తున్నాయి. ఇలాం సందర్భంలో హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న భవనాలు భద్రమేనా..? అనే అనుమానం వ్యక్తం అవుతుంది. 60 అంతస్థుల ఎత్తులోని భవనాల నిర్మాణాల్లో బిల్డర్లు ఏ మేరకు సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా పరిణమిస్తున్నది.
ఆయా భవనాల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, ఫైర్ రెసిస్టెన్స్ సరంజమా.. అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తున్నప్పటికీ అవి ఎంతమేరకు సెఫ్టీనో అని ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంత పెద్ద భవనంలో ఎక్కడైనా పొరపాటున అగ్నిప్రమాదం జరిగితే, ఫైర్ సిబ్బంది సులభంగా మంటలను అదుపులోకి తీసుకురాగాలరా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి అడ్వాన్స్‌డ్ పరికరాలు మన వద్ద ఉన్నాయనేదీ ప్రశ్నార్థకమే ? అభివృద్ధి చెందిన యూరప్, గల్ఫ్, అమెరికన్ దేశాల్లో అందుబాటులో ఉన్న ఫైర్ రెసిస్టెన్స్ సాంకేతికత మన వద్ద ఉందా.. ? అంటే.. ఆలోచించకుండా లేదనే చెప్పాలి. ప్రస్తుతం నిర్మాణ రంగంలో కొంత స్తబ్దత ఉన్న కారణంగా బిల్డర్లు నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చే అవకాశమూ లేకపోలేదు. అలాగే నిర్మాణాలపై క్వాలిటీ చెకింగ్ వ్యవస్థ ఉన్నదా? జీహెచ్‌ఎంసీలో గానీ, హెచ్‌ఎండీఏలో గానీ అసలు అలాంటి విభాగం ఏదైనా ఉన్నదా..? అని బయ్యర్లు ప్రశ్నిస్తున్నారు.
వీటిని గమనించాలి..
ఎత్తున భవనం కానీ, ఏదేని కట్టడానికి వినియోగదారులు విద్యుద్దీకరణకు వినియోగించిన విద్యుత్ తీగల నాణ్యతను పరిశీలించాలి. నాణ్యమైన సామగ్రి వినియోగించారో లేదో చూసుకోవాలి. ప్రతి ఫ్లాట్‌కు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటేనే ఆ ఫ్లాట్ తీసుకునేందుకు ఒప్పుకోవాలి. ఎలక్ట్రికల్ కార్డ్‌లు, ఓవర్‌లోడ్ సాకెట్లను ఒకటికి రెండుసార్లు చెక్‌చేసుకోవాలి. ఫ్లాట్‌కు వెంటిలేషన్ సౌకర్యం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
అంతస్థులోని ప్రతి ఫ్లోర్‌లో ఫైర్ అలారాలు పని చేస్తున్నాయా ? లేదా? అనేది నిర్ధారించుకోవాలి. ఫైర్ ఎక్సిట్విన్‌గిషర్స్‌తో పాటు అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? లేదా? అని చూసుకోవాలి. ఒకవేళ అగ్నిప్రమాదం సంభవిస్తే మంటలు ఆర్పేందుకు ఆ సామగ్రిని సమర్థంగా వినియోగించేంత అవగాహనను ప్రతిఒక్కరూ పెంచుకోవాలి. ప్లాట్ లోపలి భాగంలో ధూమపానాన్ని నిషేధించాలి. ఆటోమేటిక్ డయల్‌లో టెలిఫోన్ డైరెక్టరీలో అత్యవసర సమయంలో చేయాల్సిన నంబర్లను నమోదు చేసి ఉంచాలి. మైక్రోవేవ్‌లు వంటి నిష్క్రియ ఉపకరణాలను ఉపయోగించనప్పుడు వాటిని అన్‌ప్లగ్ చేయాలి.






