calender_icon.png 18 February, 2026 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవుడి ముందే మత్తు రీల్సా?

18-02-2026 12:00:00 AM

  1. శివరాత్రి వేళ గంజాయితో వికృత చేష్టలు
  2. ఇద్దరు యువకుల అరెస్ట్  

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినం వేళ కొందరు యువకులు దేవుడి పటాల ముందు మాదకద్రవ్యాలను ప్రదర్శిస్తూ రీల్స్ చేయడంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రస్థాయిలో మండిప డ్డారు. చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో కొందరు యువకులు దేవుడి ముందు కూర్చుని ప్రసాదం అంటూ గంజాయిని చూపిస్తూ అసభ్యకరంగా రీల్స్ చేశారు.

దీనిపై ఎక్స్ వేదికగా స్పందించిన కమిషనర్ సజ్జనార్.. భక్తికి, ముక్తికి సోపానమైన పండుగను ఇలాంటి అసాంఘిక చర్యలతో అపహాస్యం చేయడం అత్యంత హేయమైన చర్య అని అభివర్ణించారు. సాహసం చేశామని చెప్పుకోవడానికి, ఫేమ స్ అవ్వడం కోసం డ్రగ్స్‌ను ప్రచారం చేయ డం తీవ్రమైన నేరం. కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు.

ఫలక్‌నుమా జంగమ్‌మెట్ ప్రాంతానికి చెందిన సభావత్ శ్రీ చరణ్, వర్తేవత్ విజయ్ కృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవుడి పటాల ముందు గంజాయిని ప్రదర్శిస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు వారిపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మత్తు పదార్థాల వాడకంతో పాటు భక్తిని కించపరిచినందుకు వీరిపై కఠిన చర్య లు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. క్షణికానందం కోసం చేసే పనుల వల్ల బంగారు భవిష్యత్తును కటకటాల పాలు చేసుకోవద్దని సీపీ సజ్జనార్ యువతకు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై వారి స్నేహితులపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.