ధర్నా చౌక్‌కు వెళ్లడానికి సిగ్గు లేదా?
- ‘నీట్’ లీక్‌పై నెలన్నరకు నిద్రలేచిన కేటీఆర్
- గ్లోబరీనా రిపోర్టును ఎందుకు బయటపెట్ట లేదు?
- బీఆర్‌ఎస్ హయాంలో విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత ఎవరిది?
- పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): ధర్నా చౌక్‌ను ఎత్తేసిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీదేనని, ఇప్పుడు అదే స్థలంలో ధర్నాలు చేసే హక్కు కేటీఆర్‌కు ఎక్కడిదని, అసలు అక్కడకు వెళ్లేందుకు కేటీఆర్‌కు సిగ్గులేదా అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో కేటీఆర్ ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
నీట్ ప్రశ్న పత్రం లీక్ ఘటన జరిగి నెలన్నర తర్వాత కేటీఆర్ నిద్రలేచారని ఆయన విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై వృద్ధాప్యంలోనూ మల్లికార్జున ఖర్గే పోరాడుతుంటే, ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన మహేష్‌కుమార్ గౌడ్.. బీఆర్‌ఎస్ హయాంలోనే లీకుల పరంపర కొనసాగిందని ఆరోపించారు.
ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు గ్లోబరీనా సంస్థ కారణమైందని, ఆ సంస్థకు సంబంధించిన నివేదికను అప్పట్లో ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ‘గ్లోబరీనా సంస్థ పేరు మార్చుకుని మళ్లీ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది. ఆ సంస్థ వ్యవహారంలో కేటీఆర్ పాత్రపై అనుమానాలు ఉన్నాయి’ అని ఆయన పీసీసీ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.
గ్లోబరీనా సంస్థ కారణంగా 20 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించిన ఆయన, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల నుంచి చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని సూచించారు.
రాహుల్‌గాంధీకి మైలేజ్ వస్తుందన్న భయంతోనే..
మే 12న నీట్ పరీక్ష పేపర్ లీక్ అయితే ఇప్పుడు కేటీఆర్ మొద్దు నిద్ర నుంచి లేచారని మహేష్‌కుమార్ గౌడ్ విమర్శించారు. రాహుల్‌గాంధీకి రాజకీయ మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతో ప్రధాని మోదీతో కుట్ర పన్ని నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ చేస్తున్న రాజకీయ డ్రామాలో విద్యార్థులు భాగస్వాములు కావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ పాలనలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా సక్రమంగా ఇవ్వలేదని, గ్రూప్--1 పరీక్ష కూడా లీకుల ఆరోపణలతో వివాదాస్పదమైందని అన్నారు. ఇదిలా ఉంటే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా మహేష్‌కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.






