16 April, 2026 | 4:52 AM

సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ ప్రారంభం

06-12-2025 12:00 AM

నిజామాబాద్, డిసెంబర్ 5 (విజయ క్రాంతి) : సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమాన్ని  పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు, సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్.సీ.సీ క్యాడెట్లు, ఆర్మీ అధికారులు, సిబ్బంది జిల్లా పాలనాధికారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, గౌరవ వందనం సమర్పించారు.

అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ లతో పాటు కలెక్టరేట్ లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు సైనిక సంక్షేమ నిధికి తమవంతుగా విరాళాలు అందించారు. సైనికుల త్యాగాలను ప్రతి పౌరుడు గుర్తిస్తూ, వారి పట్ల, వారి సేవల పట్ల గౌరవభావంతో మెలగాలని, సాయుధ దళాలకు మద్దతుగా నిలువాలని పిలుపునిచ్చారు.  సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది నుంచి మరింత అట్టహాసంగా నిర్వహించాలని, అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ  అధికారి రవీందర్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.