గణపురంలో శ్రీ గురుపౌర్ణమి మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
గణపురం, జులై 28 (విజయ క్రాంతి): మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో నేడు బుధవారం జరగనున్న గురుపౌర్ణిమ మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పద్మ దంపతులు హాజరు కానున్నట్లు ఆలయ అర్చకులు వినయ్ తెలిపారు. ఉదయం 5 గంటలకు ప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
అనంతరం ఉదయం 6 గంటలకు శ్రీ సాయినాథునికి మంగళస్నానం, సుప్రభాత సేవలు నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల వరకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అష్టోత్తర శతనామార్చన, సహస్రనా మార్చనలు జరుగుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు మహానైవేద్యం, మహా హారతి, తీర్థప్రసాద వితరణ చేపడతారు.
సాయంత్రం 5 గంటలకు అష్టోత్తర శతనామార్చన, 6 గంటల 15 నిమిషాలకు సంధ్యా హారతి, రాత్రి 8 గంటలకు పల్లకి సేవ, 8 గంటల 45 నిమిషాలకు శేజ హారతితో ఉత్సవాలు ముగుస్తాయి.ఈ పవిత్ర మహోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు. భక్తులకు మధ్యాహ్నం ఒక గంట నుంచి మూడు గంటల వరకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు అర్చకులు తెలిపారు.






