25 March, 2026 | 1:47 AM

దోపిడీకి పాల్పడిన ముగ్గురు నిందితుల అరెస్టు

03-12-2024 06:55 PM

50 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు

కూకట్ పల్లి (విజయక్రాంతి): యజమాని వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి మరో ఇద్దరితో కలిసి యజమాని ఇంట్లో దోపిడీకి పాల్పడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటనలో ముగ్గురు నిందితులను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బాలానగర్ డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి సురేష్ కుమార్ నిందితుల వివరాలను వెల్లడించారు. కూకట్పల్లి జయనగర్ శ్రీ సీతా ప్యాలెస్ లో నివాసముంటున్న కమాని మధుసూదన్ తన కుమార్తె బిడ్డకు జన్మనివ్వడంతో చూసి రావడం కోసం గత నెల 28వ తేదీ సాయంత్రం మియాపూర్ కి వెళ్లి తిరిగి మరుసటి రోజు వచ్చి చూడగా పడకగది తాళం పగలగొట్టి బీరువా తెరిచి ఉండడానికి గమనించిన మధుసూదన్ దొంగలు పడినట్లు గుర్తించాడు. వెంటనే బాధితుడు కూకట్పల్లి పోలీసులకు దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కూకట్పల్లి, బాలానగర్ సిసిఎస్ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా 200 కెమెరాలను పరిశీలించి నిందితులను పట్టుకొని కేసును చేదించారు. కృష్ణా జిల్లాకు చెందిన సంపంగి లక్ష్మణ్ (44) వివేకానంద నగర్ కాలనీలో నివాసం ఉంటూ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కృష్ణా జిల్లాకు చెందిన గుమ్మడి మురళి(54) కార్ డ్రైవర్ అతని కుమారుడు గుమ్మడి నాగ శంకర్(23) సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో దొంగతనాల్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే మధుసూదన్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడి 80 తులాల బంగారు ఆభరణాలు, రెండు లక్షల నగదు, 175 గ్రాముల ముత్యాల హారాలు, 157 గ్రాముల వెండి వస్తువులు దొంగిలించి పరారయ్యారు. ఆధునాతన టెక్నాలజీతో సీసీ కెమెరాలు ద్వారా నిందితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి సత్తును స్వాధీనం చేసుకొని మంగళవారం రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, క్రైమ్ డిసిపి నరసింహ, కూకట్పల్లి ఏసిపి శ్రీనివాసరావు, సిఐ ముత్తు, డిఐ వెంకటేశంతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.