calender_icon.png 21 January, 2026 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక నిర్లక్ష్యపు చర్య

21-01-2026 07:57:35 PM

- జీవితాంతం బాధ మిగిలిస్తుంది

- ప్రమాదాల నివారణకు అందరం కలిసి పనిచేద్దాం

- సీపీ అంబర్ కిషోర్ ఝా

మంచిర్యాల,(విజయక్రాంతి): రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో ఒక నిర్లక్ష్యపు చర్యతో వారి కుటుంబంలో జీవితాంతం బాధను మిగిలిస్తుందని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. బుధవారం మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన “అరైవ్–అలైవ్” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లడారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు సురక్షితమైన ప్రయాణ వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కలిసి పనిచేయాలన్నారు. వాహనదారులు ఇంటి నుంచి బయలుదేరి సురక్షితంగా గమ్యాన్ని చేరి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవాలనే ప్రధాన లక్ష్యంతోనే ఈ అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాకుండా, సమాజానికి సంబంధించిన అంశమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. హెల్మెట్ ప్రాముఖ్యత అందరికీ తెలిసినప్పటికీ, దాన్ని ధరించకపోవడమే అనేక ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోందని సీపీ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు శాశ్వత అంగవైకల్యంతో జీవితాంతం బాధపడాల్సి వస్తోందన్నారు. ఎక్కువగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని సూచించారు. మానవ తప్పిదాలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని, అందుకే పట్టణాలు, గ్రామాల్లో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రమాదం జరిగిన ప్రదేశాలను కమిటీ సభ్యులు పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించి, ఆ ప్రాంతంలో మళ్లీ ప్రమాదాలు జరగకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ప్రమాదాల రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దేందుకు మూడు (ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్ (అవగాహన), ఎన్ఫోర్స్‌మెంట్ (కఠినంగా అమలు) విధానాలను అమలు చేస్తున్నామని, సమాజంలోని మారుమూల ప్రాంతాల వరకు సమాచారాన్ని చేరవేసే శక్తి మీడియాకు ఉన్నందున, పోలీస్ శాఖ సమన్వయంతో మీడియా రోడ్డు భద్రత సందేశాలను ప్రతి ఇంటికి చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని సీపీ కోరారు. అనంతరం అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా అరైవ్–అలైవ్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐలు ప్రమోద్ రావు, అశోక్, శ్రీలత,నరేష్ కుమార్,ఎస్సైలు పాల్గొన్నారు.